ప్రత్యామ్నాయమే మిగిలింది.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమే మిగిలింది..

Jul 20 2026 1:20 AM | Updated on Jul 20 2026 1:20 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కరువు కోరలు చాచే పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్‌నినో ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఈ మేరకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు.

అట్టడుగుకి జలాశయాల నీటిమట్టం

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు శ్రీరామ్‌సాగర్‌, నిజాంసాగర్‌తోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటితో సాగునీరందించడం పక్కన పెడితే తాగునీటి అవసరాలూ తీర్చడం సైతం కష్టంగా మారింది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.149 టీఎంసీల నీరుంది. గతేడాది ఇదే సమయానికి 20.902 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.516 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఎలాంటి చర్యలు తీసుకుంటారో..

ఇప్పటికే ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల్లో నీరు లేక పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టుల ఆయకట్టు కింద పంటలు సాగుచేసిన రైతులు వాటిని కాపాడుకునేందుకు అపసోపాలు పడుతున్నారు. అయితే పంటల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే విత్తనాలు, సాగుకోసం రూ. వేలల్లో ఖర్చుచేసిన రైతులు పంటల ఎదుగుదల, దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. ఈసారి పెట్టుబడులు సైతం కోల్పోయి తీవ్రంగా నష్టపోతామన్న గుబులు రైతుల్లో నెలకొంది.

ఆరుతడి పంటలకై నా అందిస్తారా?

గతేడాదితో పోలిస్తే ఈసారి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో వరికి సాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు పరిధితోపాటు బోర్లపై ఆధారపడి వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకీ మరింత అట్టడుగు స్థాయిలోకి పడిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరుతడి పంటలకై నా నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్న డిమాండ్‌ నెలకొంది. పంటలకు నీరందించేందుకు కీలకమైన విద్యుత్‌ సరఫరాలో కోతలను నివారించాలని రైతులు కోరుతున్నారు.

సిరికొండ మండలం ముషీర్‌నగర్‌ గ్రామానికి చెందిన రైతు బట్టు లింబాకు చెందిన పొలం పరిస్థితి ఇది. ఆయనకు ఉన్న మూడున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. పంట సాగు కోసం లింబ బోరు నీటిపై ఆధారపడగా.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 రోజుల కిందటే బోరు వట్టిపోయింది. చేసేదేమీ లేకపోవడంతో ఇప్పటికే పొలం సగానికి పైగా ఎండిపోయింది. ఇప్పుడు వర్షాలు కురిసినా పొలం చేతికొస్తుందా.. లేదా.. అనే ఆందోళనలో లింబా ఉన్నాడు.

జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటలు

20 రోజుల నుంచి వర్షమే లేదు

ఈసారి వరి, మొక్కజొన్న పంటలు సాగుచేశాను. గుత్ప ఎత్తిపోతల పథకం కింద నీళ్లు వస్తాయన్న ఆశతో పంటలు వేసిన. ఈసారి మొదటినుంచి వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. మొక్కజొన్న పంట వేసిననాటి నుంచి ఇప్పటివరకు గత 20 రోజులుగా వర్షమే పడలేదు. ఇంకా రెండు, మూడు రోజుల్లోనైనా వర్షం పడకుంటే పంటపై ఆశ వదులుకోవాల్సిందే. – మొగులాజీ, బజార్‌కొత్తూరు, నందిపేట మండలం

ప్రభుత్వం ఆదుకుంటేనే బతుకు

ఈ సీజన్‌లో ఇప్పటివరకు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటివరకు గుత్ప ఎత్తిపోతల పథకం కింద వచ్చే నీటితో పంటలు పండించుకున్నాం. ఈసారి నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పంటలసాగుకు సమయం మించిపోయింది. ప్రభు త్వం ప్రత్యామ్నాయ చర్యలతోపాటు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – శిలారి సుధాకర్‌, వల్లభాపూర్‌, మాక్లూర్‌

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

భవిష్యత్‌లో తాగునీటి

అవసరాలకూ తిప్పలే !

ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆశలు

ఉమ్మడి జిల్లాలో పరిస్థితులపై నేడు

సమీక్షించనున్న ఇన్‌చార్జి మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement