ఆర్మూర్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన తన భూమిని పలువురు ఆక్రమించుకున్నందున ఆ భూమిని తిరిగి తనకు ఇప్పించాలని బాధితురాలు ఎర్రవ్వ గ్రామస్తులతో కలిసి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణకు శుక్రవారం వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం జోగినీ వ్యవస్థను రూపు మాపడంలో భాగంగా ఎర్రవ్వకు పునరావాసం కల్పిస్తూ గ్రామ శివారులో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.18 గుంటల భూమిని కేటాయించారని వివరించారు. ఈ భూమిలో గుట్ట ఉండటంతో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేసి బోరు వేసి ధోబీ ఘాట్‌ను సైతం నిర్మించారని బాధితురాలు వాపోయింది. పూర్తి స్థాయి విచారణ జరిపి తన భూమిని తనకు ఇప్పించాలని అధికారులకు విన్నవించింది.


