అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాం | - | Sakshi
Sakshi News home page

అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాం

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

నిజామాబాద్‌అర్బన్‌: పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. కార్యక్రమం అమలులో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను ముందంజలో నిలపాలని సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వివిధ శాఖల వారీగా పరిసరాల శుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, అరైవ్‌–అలైవ్‌, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌ కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగులు ప్రగతి ప్రణాళిక అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పారదర్శకతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రణాళిక అమలు ద్వారా ఆయా శాఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ను వినియోగించాలని ఉమ్మడి జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. ప్రభుత్వ సౌకర్యాలు, పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. కేంద్రం ద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయించేలా చొరవ చూపాలన్నారు. వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్‌ సంగ్వాన్‌లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు, అంశాల వారీగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు దివ్యాంగులకు మంత్రి సీతక్క ల్యాప్‌టాప్‌లు అందజేశారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్‌ ఉమారాణి, నుడా చైర్మన్‌ కేశ వేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేష్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు కిరణ్‌ కుమార్‌, దిలీప్‌ కుమార్‌, బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, డీఎఫ్‌వోలు వికాస్‌ మీనా, నిఖిత, ఏసీపీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు పాల్గొన్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ధనసరి అనసూయ

నగరంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు,

అధికారులతో సన్నాహక సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement