జిల్లా దాటిన పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

జిల్లా దాటిన పెద్దపులి

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణలో పెద్ద పులి సంచారం కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో సంచరిస్తోంది. పెద్ద పులి తాజాగా శుక్రవారం మళ్లీ నిజామాబాద్‌ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా మల్యాల అటవీ ప్రాంతం మీదుగా సిరిసిల్ల జిల్లా చందుర్తి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చందుర్తి అటవీ ప్రాంతం సమీపంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి ఈ నెల 3వ తేదీన సిరిసిల్ల జిల్లా మీదుగా నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌లోని గట్టుపొడిచినవాగు వద్దకు వచ్చింది. ట్రాప్‌ కెమెరాకు చిక్కింది. తోడు కోసం వెతుక్కుంటూ తిరుగుతున్న ఈ పులి మళ్లీ వచ్చిన దారిలోనే వెళ్లింది. అయితే ఈ పెద్ద పులి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు సైతం ఉన్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అటవీ అధికారులు ఈ పులికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు గాను అన్ని అటవీ రేంజ్‌ల పరిధి లో పెట్రోలింగ్‌ మరింత ముమ్మరం చేశారు. పులిని జాగ్రత్తగా సంరక్షించే అంశం అటవీ శాఖకు పెద్ద సవాల్‌గా మారింది.

అటవీ శాఖకు అతిపెద్ద సవాల్‌..

గత ఏడాది జూలైలో పెద్ద పులిపై విషప్రయోగం జరిగిన ఘటన నేపథ్యంలో ఈ పులికి సైతం అలాంటి హాని జరుగకుండా చూసేందుకు గా ను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. విషప్రయోగం జరుగకుండా, వేటగాళ్ల బారిన పెద్ద పులి పడకుండా, వ్యవసాయ క్షేత్రాల వద్ద, అటవీ భూముల్లో ఏమైనా తీగలు, ఉచ్చులు పెట్టి ఉంటే వాటిని గుర్తించి తొలగించేందుకు గాను అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో టెన్షన్‌ పడుతున్నారు. పెద్ద పులి బారిన పడకుండా ఉండాలని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే దాన్ని రక్షంచేందుకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా పులి జనావాసాల్లోకి వస్తేనే, మనుషులపై దాడి చేస్తేనే.. వైల్డ్‌ లైఫ్‌ బోర్డు నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు. పెద్ద పులికి ఎలాంటి హాని తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో అటవీశాఖకు అతిపెద్ద సవాల్‌గా మారింది.

ఆ పులి ఆచూకీ మిస్టరీ

2025 జూలై నెలలో కామారెడ్డి జిల్లాలోకి మరో పెద్ద పులి ప్రవేశించి అటవీ ప్రాంతా ల్లో తిరుగాడింది. ఈ క్రమంలో సదరు పులి మాచారెడ్డి రేంజ్‌ పరిధిలో ఓ ఆవును చంపేసింది. పులి మళ్లీ ఆవు మాంసం తినేందు కు వస్తుందనే ఆలోచనతో కొందరు సదరు ఆవు కళేబరంపై విషం చల్లారు. అటవీ అధికారులు విషప్రయోగం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే ఆ పులి తరువాత కనిపించకుండా పోయింది. దీంతో ఆ పులి మరణించిందా లేక మరోవైపు వెళ్లిందా అనే విషయ మై ఇప్పటికీ ఆనవాళ్లు లేకుండా పోవడం పట్ల అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ పులి ఆచూకీ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.

మళ్లీ ఉమ్మడి కరీంనగర్‌

జిల్లాలోకి ప్రవేశం

సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రాంతంలో పాదముద్రల గుర్తింపు

కామారెడ్డి జిల్లా అటవీప్రాంతంలోకి వచ్చే అవకాశాలు

పెద్ద పులి రక్షణే అటవీశాఖకు సవాల్‌

గత జూలైలో కామారెడ్డి జిల్లాలో పులిపై విషప్రయోగం నేపథ్యంలో టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement