నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, వారి సంపద భారీగా పెరిగిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి రామనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న ధోరణిలో ఉన్నారన్నారు. స్థానిక సంస్థలు, జిల్లా, మండల పరిషత్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని విమర్శించారు.
కీలక శాఖల్లో వసూళ్లు, కమీషన్లు
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో వసూళ్లు, కమీషన్ల ఆ రోపణలు తీవ్రస్థాయికి చేరాయన్నారు. సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని రూ.7 కోట్లకే కేటాయించారనే కథనాలపై సీఎం వివరణ ఇవ్వాలన్నారు. లక్ష రూపాయల పెట్టుబడి, ఉద్యోగులు లేని కంపెనీకి ఏ ప్రాతిపదికన భూమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బిల్లుల క్లియరెన్స్‌కు కమీషన్
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ బిల్లులకు 10 శాతం, చిన్న కాంట్రాక్టర్లకు 20 శాతం, మరికొన్నింటికి 30 శాతం కమీషన్ అడిగారనే ఆరోపణలపై భట్టి విక్రమార్క స్పందించాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ కంపెనీకి ఫీనిక్స్ నుంచి రూ.15 వేల కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయనే ఆరోపణలపై వివరణ కోరారు. మంత్రులపై అవినీతి ఆరోపణలను ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. బాధిత చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఏసీబీకి ఫిర్యాదు చేయాలని, వారికి ఇబ్బందులు వస్తే బీజేపీ అండగా నిలుస్తామన్నారు. అవినీతిని ప్రశ్నించడం ద్వేషం కాదని, ప్రజాస్వామ్య హక్కులను అణచే చట్టాలను సహించమన్నారు.
కరప్షన్ కేబినెట్..
ఆంధ్రా కాంట్రాక్టర్లను ప్రభుత్వం దోచుకుంటోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించడంపై సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తుంటే అవినీతి స్థాయి అర్థమవుతోందని, మంత్రివర్గం ‘కరప్షన్ కేబినెట్’ అయిందన్నారు. అంతర్గత విభేదాలు మొదలయ్యాయని, మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో బహిరంగంగా మాట్లాడతారని, మంత్రుల అవినీతి వ్యవహారాలు బయటపడతాయన్నారు. సమావేశంలో రావుల రాంనాథ్, చిన్నయ్య, రాజు, శ్రీరామోజీ నరేశ్, అర్జున్, ఈశ్వర్, సాత్విక్ పాల్గొన్నారు.


