మధ్య కాలువ తూము చెడిపోయి..
యాసంగి పంట సాగు సమయంలో మధ్యకాలువ గేటును కిందకు దింపే ప్రక్రియలో గేటును పైకి–కిందకు కదిలించే రాడ్ విరిగిపోయింది. ఫలితంగా గేటు కిందకు దిగని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ప్రాజెక్టులో ఉన్న నీరంతా అధికారులు మధ్యకాలువ ద్వారా ధని, బోరిగాం, ఆలూరు, వేంగ్వాపేట్ చెరువులకు మళ్లించారు. ప్రస్తుతం ఈ నాలుగు చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యకాలువ తూములో ఇసుక సంచులు, గడ్డి కట్టలు అడ్డువేసి తాత్కాలికంగా మూసివేశారు. అయితే ప్రాజెక్టు నిండిన తర్వాత ఆయకట్టుకు నీటిని విడుదల చేసినా సరిగా పొలాలకు చేరకపోవడంతో రైతులు వరినాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేటును సరైన మోతాదులో ఎత్తితేనే ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉంది.
సారంగపూర్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి ఆశించిన వర్షాలు కురవడం లేదు. ఇటీవల అల్పపీడనం ప్రభావంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ఇటీవలి వర్షాలతో నీటిమట్టం 1,182.5 అడుగులకు చేరుకుంది. మరో అయిదు అంగుళాల నీరు చేరితే పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉంది.
విలువైన నీరు వృథా
అయితే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలు అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడమే కాకుండా, లీకేజీల రూపంలో ప్రతిరోజు వందలాది క్యూసెక్కుల విలువైన సేద్యపు నీరు వృథాగా గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆయకట్టు రైతుల పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ప్రాజెక్టు కింద మూడు ప్రధాన కాలువలు (కుడి, మధ్య జౌళినాల, ఎడమ) ఉన్నాయి. వీటి ద్వారా 10 వేల ఎకరాల సాగుభూమి, అలాగే ఆలూరు, బోరిగాం, ధని, నిర్మల్ రూరల్ మండలం వేంగ్వాపేట్ చెరువులు సాగునీరు విడుదల చేస్తారు.
రైతుల వేడుకోలు
గేటు నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే రావడంతో పంటలకు సరిపడా నీరు అందుతుందా లేదా అనే సంశయంతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అదే సమయంలో విలువైన సేద్యపు నీరు లీకేజీల రూపంలో బయటకు వెళ్తుండటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇకనైనా అధికారులు తక్షణం స్పందించి గేట్ల లీకేజీలను అరికట్టి, మధ్యకాలువ ద్వారా పంటలకు సరిపడా నీరు అందించే చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.
గేట్ల లీకేజీలు అరికడతాం..
గేట్ల లీకేజీతో నీరు బయటకు వెళ్లిపోతున్న విషయం వాస్తవమే. ప్రస్తుతం గేట్ల లీకేజీలు సవరించడానికి ఇబ్బంది లేదు. జనుముతో గేట్ల లీకేజీలను సవరించవచ్చు కానీ మళ్లీ వర్షాలు కురిస్తే గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే వేసిన జనుమంతా వరదలకు కొట్టుకుపోతుంది. అందుకే ఆరుగేట్లలో నాలుగు గేట్లు జనుముతో మూయించి మరో రెండు గేట్లను అలాగే ఉంచేలా చర్యలు చేపడుతున్నాం.
– వేణుగోపాల్, ఏఈ, స్వర్ణ ప్రాజెక్టు


