పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ పెద్దవాగులో పడి యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్‌పేట్ గ్రామానికి చెందిన మేకల జంపన్న (20) తన స్నేహితుడు అరికిల్ల కిశోర్‌తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి పెద్దవాగుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఎల్కపల్లి గ్రామానికి చెందిన బాలుడితో కలిసి వాగులో స్నానం చేయడానికి దిగాడు. వాగులో లోతు ఎక్కువగా ఉండటం, వరద ప్రవాహం పెరగడంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. ఎల్కపల్లి గ్రామానికి చెందిన బాలుడు సమీపంలోని పిల్లర్ చువ్వను పట్టుకుని బయటికి రాగా, జంపన్న నీటిలో మునిగిపోయాడు. ఒడ్డునున్న స్నేహితుడు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు జాలర్లతో గాలింపు చేపట్టగా జంపన్న మృతదేహం లభించింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోధించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్, దహెగాం ఎస్సైలు అనిల్‌కుమార్, రమేశ్ పరిశీలించారు.


