ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ పట్టణానికి చెందిన ఉస్కామొల్ల నాగన్న పాత నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణను హాబీగా చేసుకున్నారు. పాత బస్టాండ్ ఆవరణలో ఓ చిన్న పాన్ షాప్ నడుపుకొనే నాగన్న ఇప్పటివరకు పాత నాణేలతోపాటు 57 దేశాల కరెన్సీని సేకరించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు వాడుకలో ఉన్న రాగి నాణేలు, అణాలు, పైసల నుంచి మొదలుకుని నేటి ఆధునిక కరెన్సీ వరకు నా గన్న వద్ద విభిన్న రకాల నాణేలున్నాయి. బ్రి టిష్ కాలం నాటి రాగి నాణేలు, నిజాం నవా బుల కాలం నాటి నాణేలు, పాతకాలపు రంధ్రం నాణేలు, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇందిరాగాంధీ, నెహ్రూ బొమ్మల నాణేలను ఆయన ఎంతో భద్రంగా దాచారు. తన షాప్‌నకు వచ్చే వారికి నాణేలు చూపిస్తూ అప్పటి చరిత్రను వివరిస్తుంటారు. అతని అభిరుచిని చూసిన వారంతా అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
ఇదే నాకు ఇష్టమైన హాబీ
ఇప్పటి పిల్లలకు పాతకాలపు నాణేలు, అణాలు అంటే ఏంటో తెలీదు. మనం వాడిన కరెన్సీ మన రాబోయే తరాలకు తెలియాలి. మన సాంస్కృతిక, ఆర్థిక ప్రస్థానాన్ని వారికి చూపించడమే నా తాపత్రయం. అందుకే పాతకాలపు నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణ హాబీగా ఎంచుకున్నాను. – నాగన్న


