పంద్రాగస్టుకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు సర్వం సిద్ధం

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

● ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాట్లు ● జెండా ఎగురవేయనున్న విప్‌ వీరేశం ● ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించే వేడుకలకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో వేడుకలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈమేరకు మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు అధికారులు స్థానికులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు సమకూర్చారు.

9.30 గంటల నుంచి వేడుకలు..

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 9:35 గౌరవ వందన స్వీకరణ, 9:37 నుంచి 10 గంటల వరకు ముఖ్య అతిథి సందేశం, 10 నుంచి 10.40 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10:45 నుండి ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు, ఉత్తమ శకటాలకు పతకాలు ప్రదానం చేస్తారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేడుకలు ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్‌

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పోలీసు పరేడ్‌ మైదానం, ముఖ్యులు, ప్రజాప్రతినిధులు కూర్చునే స్థలాలు, సాంస్కృతిక ప్రదర్శనల విభాగాలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం కడ్తాల్‌ సమీపంలోని సాగర్‌ కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్డుల పంపిణీకి వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, డీఈవో భోజన్న, అగ్నిమాపక అధికారి శివాజీ, డీఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్‌వో రాజేందర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement