పోరు వీరులను మరిసిండ్రు..! | - | Sakshi
Sakshi News home page

పోరు వీరులను మరిసిండ్రు..!

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

● స్వతంత్ర సమరయోధుల త్యాగాలకు దక్కని గుర్తింపు● ఆంగ్లేయులు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరులెందరో.. ● నెలల తరబడి జైళ్లలో మగ్గిన త్యాగధనులు ● స్మారకాలు, జ్ఞాపకాలకూ అవమానమే..

నిర్మల్‌: స్వాతంత్య్రం కోసం దేశం యావత్తూ పోరుబాట పట్టిన వేళ నిర్మల్‌ జిల్లా కూడా వెనుకడుగు వేయలేదు. ఆంగ్లేయులు, నిజాం సేనల దమనకాండను ఎదురించి ఎందరో అమరవీరులు, సమరయోధులు అలుపెరగని పోరాటం చేశారు. స్వేచ్ఛ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. నెలల తరబడి జైళ్లలో మగ్గారు. కుటుంబాలకు దూరమై ఎన్నో కష్టాలను అనుభవించారు. వారి పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. అలాంటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి పరిచయం చేయడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ.. స్థానికంగా కీలకపాత్ర పోషించిన సమరయోధుల చరిత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.

సమరయోధులెందరో..

ప్రథమ భారత సంగ్రామంలో భాగంగా 1858లో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులు నిర్మల్‌ గడ్డపై అలుపెరుగని పోరాటం చేశారు. తమ ప్రాణాలు అర్పించారు. వారి పోరాట స్ఫూర్తితో ఎంతోమంది సమరయోధులు స్వాతంత్య్ర పోరాటంలోకి దిగారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రుమూకలపై పోరాడారు. తొలిదశ పోరులో రాంజీగోండు ప్రజలను ఏకం చేస్తే.. మలిదశ పోరులో నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు సంఘటితంగా పరాయిపాలనపై ఉద్యమించారు. నాటి నిర్మల్‌ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్‌, ఏ.రాజన్న, పోశెట్టి, గంగాధర్‌, శివన్న, గంగారామ్‌, విఠల్‌రావు, జమునాలాల్‌, వెంకోబరావు, చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్‌రాజ్‌, ముడుసు ఎల్ల య్య, అర్గుల గంగాధర్‌గుప్తా, గాంధారి లక్ష్మణ్‌, ఠాకూర్‌ హన్మంత్‌రావు.. ఇలా ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడారు.

నెలల తరబడి జైళ్లల్లో..

నిజాం, ఆంగ్లేయుల అణచివేతలో భాగంగా ఎందరోమంది సమరయోధులు జైళ్లకు వెళ్లారు. స్థానిక జైళ్లల్లో కాకుండా వీరిని ఇక్కడి నుంచి వరంగల్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌, చంద్రాపూర్‌, ఔరంగాబాద్‌ తదితర దూర ప్రాంత జైళ్లకు పంపించేవారు. అక్కడ నెలల తరబడి మనవాళ్లు మగ్గేవారు. ఒక్కోసారి ఎన్ని నెలలైనా వాళ్లు ఇంటికి రాకపోవడంతో చనిపోయారేమో అనుకుని కర్మకాండలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెరువకుండా పోరు సాగించారు.

ఇదేనా గుర్తింపు..!

రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులను, స్వాతంత్య్ర సమరయోధులను పాలకులు, అధికారులు ఇప్పటికీ గుర్తించడం లేదు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన వారికి గౌరవాన్ని ఇవ్వడం లేదు. దయనీయ స్థితుల్లో ఉన్న వారి కుటుంబాల వైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పంద్రాగస్టు లాంటి వేడుకల్లోనైనా వారి పోరాటాలు, త్యాగాలను గుర్తించాలని, వారి కుటుంబాలకు ఆహ్వానం అందించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement