‘చికెన్స్ నెక్‌’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్‌! | Why the 120 Acre Siliguri Corridor Handover is a Game-Changer for India's Security | Sakshi
Sakshi News home page

‘చికెన్స్ నెక్‌’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్‌!

Jun 3 2026 7:50 AM | Updated on Jun 3 2026 8:41 AM

Why the 120 Acre Siliguri Corridor Handover is a Game-Changer for India's Security

‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్).. ఇది పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత వ్యూహాత్మక, ఇరుకైన భూభాగం. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి, ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలను దేశంలోని మిగిలిన భాగంతో కలుపుతుంది. భౌగోళికంగా దీనికి ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పైభాగంలో భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతంపై చైనా ఎప్పటినుంచో కన్నేసి ఉంచడం వల్ల సరిహద్దు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. 2017లో చికెన్స్ నెక్‌కు సమీపంలో ఉన్న భూటాన్ భూభాగమైన ‘డోక్లాం’లో చైనా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించినప్పుడు భారత్-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితుల్లో చైనా ఈ ఇరుకైన కారిడార్‌ను ఆక్రమిస్తే లేదా దిగ్బంధిస్తే, ఈశాన్య రాష్ట్రాలకు భారత ప్రధాన భూభాగంతో రవాణా, సైనిక సరఫరాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించడంతో పాటు, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మార్గాలను అభివృద్ధి చేస్తోంది.

సరిహద్దు భద్రతా దళానికి బాధ్యతలు
భారతదేశ రక్షణ వ్యూహాల్లో అత్యంత కీలకమైన, సున్నితమైన ప్రాంతంగా భావించే ‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్) పరిధిలోని 120 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)నకు అప్పగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి కేంద్ర ప్రభుత్వ సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ఈ భూమికి సంబంధించిన పత్రాలను బీఎస్‌ఎఫ్‌కు స్వయంగా అందజేశారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వం కాలయాపన చేసిన ఈ ప్రక్రియను నూతన ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి, రక్షణ దళాల వేగవంతమైన కదలికలకు మార్గం సుగమమైంది.

సువేందు అధికారి సంచలన నిర్ణయం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సువేందు అధికారి కేంద్రం పెండింగ్‌లో ఉంచిన కీలక డిమాండ్‌ను పరిష్కరించారు. సిలిగురి కారిడార్ పరిధిలోని ముఖ్యమైన భాగాలతో కూడిన ఏడు జాతీయ రహదారుల విభాగాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా , నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు కంచె నిర్మాణానికి గానూ బీఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న ఈ నిర్ణయం దేశ రక్షణలో ఒక మైలురాయిగా నిలవనుంది.

120 ఎకరాల భూమి ఎందుకు కీలకం?
సిలిగురి కారిడార్‌లో నోటిఫై  చేసిన ఈ 120 ఎకరాల భూమి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడి పరిపాలనాపరమైన అడ్డంకుల కారణంగా రహదారుల విస్తరణ, దెబ్బతిన్న మార్గాల మరమ్మతులు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రాజెక్టులు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయాయి. భారత సైన్యానికి, భారీ సైనిక సామగ్రి రవాణాకు అత్యుత్తమ రహదారులు అత్యంత అవసరం. సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానాన్ని బలోపేతం చేయడం భారతదేశ వ్యూహాత్మక అవసరం కావడంతో, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై పట్టు కోసం సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది.

భూగర్భ రైల్వే లైన్ ప్రణాళిక
అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈశాన్య రాష్ట్రాలతో రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు సిలిగురి మీదుగా భూగర్భ రైల్వే కారిడార్‌ను నిర్మించే పనులు సాగుతున్నాయి. సిలిగురి కారిడార్ (చికెన్స్ నెక్) గుండా వెళ్లే 40 కిలోమీటర్ల పొడవైన భూగర్భ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇదివరకే ప్రకటించారు. ఈ కీలక మార్గాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించడం వల్ల భారత సైన్య కార్యాచరణ సంసిద్ధతకు ఎంతో బలం చేకూరుతుంది. ఇది కేవలం వ్యూహాత్మక అడుగు మాత్రమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాల భద్రత
పై నెలకొన్న దీర్ఘకాలిక ఆందోళనలను తొలగిస్తుంది.

సిలిగురి కారిడార్ భౌగోళిక స్థానం
భౌగోళికంగా సిలిగురి కారిడార్ పశ్చిమాన నేపాల్ సరిహద్దులో ఉన్న పానిటాంకి నుండి, తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫుల్బరి వరకు విస్తరించి ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు, దాదాపు 60 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఇరుకైన భూభాగం నేపాల్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులను తాకుతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర వంటి ఏడు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. సిక్కిం వెళ్లే మార్గం కూడా దీని గుండానే సాగుతుంది.

పొరుగు దేశాల భూభాగాలపై భారత్ వైఖరి
భారతదేశం ఎన్నడూ పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదు. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లో దారుణ నరమేధానికి పాల్పడినప్పుడు, భారత దళాలు ఆ ప్రాంతంలోకి లోతుగా దూసుకెళ్లాయి. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పరిస్థితిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఈ 22 కిలోమీటర్ల వెడల్పు గల ఇరుకైన కారిడార్‌ను లక్ష్యంగా చేసుకోవాలని శత్రు దేశాలు తరచూ కుట్రలు  పన్నుతూనే ఉన్నాయి.

శత్రుదేశాల కుట్రలకు చెక్
భారతదేశంతో ఈశాన్య రాష్ట్రాల బంధాన్ని తెంచేందుకు చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ ఇరుకైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో కూడా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ వ్యూహాత్మక చికెన్స్ నెక్ ప్రాంతాన్ని దిగ్బంధించాలంటూ ముస్లిం విద్యార్థి నేత షర్జీల్ ఇమామ్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. అయితే శత్రువుల కుయుక్తులు ఎన్నడూ విజయవంతం కాలేదు. భవిష్యత్తులోనూ కాబోవు. ఒకప్పుడు భారతదేశ బలహీనమైన ప్రాంతంగా పరిగణించిన ఈ ఇరుకైన భూభాగం.. నూతన మౌలిక సదుపాయాల కల్పనతో ఇప్పుడు స్థిరత్వానికి, అజేయమైన శక్తికి ప్రతీకగా మారుతోంది.

ఇది కూడా చదవండి: 30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement