రెండు చేతులూ జోడించి నమస్కరిస్తే భక్తి... అదే రెండు చేతుల మధ్య ఒక చిన్న అగ్గిపుల్లను గీస్తే అది సృష్టి.. మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి. మరెన్నో సాంకేతిక విప్లవాలు దూసుకొచ్చాయి. కానీ, వాటన్నిటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది మాత్రం మన వంటింట్లో ఉండే ఒక చిన్న ‘అగ్గిపెట్టె’. ఒకప్పుడు అడవిలో మంటను వెలిగించడానికి మానవుడు శతాబ్దాల పాటు శ్రమించాల్సి వచ్చేది. అలాంటిది, కాలక్రమేణా ప్రపంచాన్ని మార్చేసిన పారిశ్రామిక విప్లవాన్ని, కళలను, సామాజిక మార్పులను తన చిన్న కాగితపు పెట్టెలో బంధించిందో అగ్గిపెట్టె. కేవలం నిప్పును పుట్టించే సాధనంగానే కాకుండా... ఒకనాటి వైభవాన్ని, స్వాతంత్ర్య ఉద్యమ ప్రచారాలను, నాటి సామాజిక పరిస్థితులను తనపై ముద్రించుకున్న లేబుల్స్ ద్వారా నేటికీ మన కళ్లకు కడుతోంది. అంతటి ఘనత కలిగిన అగ్గిపెట్టె చరిత్రను తన అవిరళ కృషితో మనముందుంచారు కోల్‌కతాకు చెందిన సావిక్ రాయ్..
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలోని సోనార్‌పూర్‌కు చెందిన 62 ఏళ్ల సౌవిక్ రాయ్.. మనం నిత్యం వాడి పారేసే అగ్గిపెట్టెలను ఒక చారిత్రక నిధిగా మార్చేశారు. గత 15 ఏళ్లుగా ఆయన సేకరించిన 30,000కు పైగా అగ్గిపెట్టెలు.. కేవలం పాత వస్తువులు కావు, అవి ఒకప్పటి సామాజిక, రాజకీయ, కళాత్మక పరిణామాలకు సజీవ సాక్ష్యాలు.
ఒక చిన్న ఆలోచన నుంచి గొప్ప ప్రస్థానం
చిన్నతనంలో స్టాంపులు, కాయిన్స్ సేకరించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ సౌవిక్ రాయ్ దృష్టి మాత్రం ఎవరూ ఊహించని అగ్గిపెట్టెలపై పడింది. 2009లో అరుదైన వస్తువుల సేకరణలో ఉన్న నెట్‌వర్క్‌తో పరిచయం పెరిగాక, అగ్గిపెట్టెలు కేవలం వెలిగించే వస్తువులు కావని, అవి ఒకప్పటి కాలానికి చెందిన ‘టైమ్ క్యాప్సూల్స్’ అని ఆయన గుర్తించారు.
15 ఏళ్ల కృషి.. అమూల్యమైన డాక్యుమెంటేషన్
ఒక అగ్గిపెట్టెను సేకరించడం అంటే దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో దాచడం కాదు, దాని చరిత్రను డాక్యుమెంట్ చేయడం అని సౌవిక్ నమ్ముతారు. ఒక్కో అగ్గిపెట్టె తయారీదారు, అది తయారైన కాలం, దానిపై ఉన్న డిజైన్ పరిణామంపై ఆయన ఎంతో పరిశోధన చేశారు. వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చితే, బెంగాల్ చరిత్రపై ఒక పూర్తి స్థాయి పాఠం నేర్చుకోవచ్చని ఆయన చెబుతున్నారు.
1870ల నుంచి మొదలై..
భారతదేశంలో అగ్గిపెట్టెల వాడకం 1870లలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడంతో మొదలైంది. ప్రారంభంలో ఇవి చెక్కతో తయారయ్యేవి. సౌవిక్ తన సేకరణ కోసం సుమారు 7,000 అగ్గిపెట్టెల లేబుల్స్ ఉన్న ఒక పాత సేకరణను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ లేబుల్స్ దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పటికీ, వాటిని ఆరు నెలల పాటు శ్రమించి అధ్యయనం చేయడం తన జీవితంలో ఒక మలుపు అని ఆయన గుర్తుచేసుకుంటారు.
అగ్గిపెట్టెలపై భారతీయ బొమ్మలు
19, 20వ శతాబ్దాల్లో జపాన్, స్వీడన్ దేశాలు అగ్గిపెట్టెల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉండేవి. భారతీయ మార్కెట్‌లో తమ పట్టు పెంచుకోవడానికి, జపాన్ తయారీదారులు ఏనుగులు, భారతీయ దేవతలు, సంస్కృతికి సంబంధించిన బొమ్మలను అగ్గిపెట్టెలపై ముద్రించేవారు. విదేశీయులు కూడా మన మార్కెట్ కోసం తమ కళను ఎలా మార్చుకున్నారో సౌవిక్ సేకరణలో స్పష్టంగా కనిపిస్తుంది.
కోల్‌కతాలోనే 136 అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలు
చాలా మంది అగ్గిపెట్టెల తయారీ కోల్‌కతాలో లేదని భావిస్తారు. కానీ తన దగ్గర ఉన్న ఆధారాలతో అక్కడ ఒకప్పుడు 136 ఫ్యాక్టరీలు ఉండేవని సౌవిక్ నిరూపిస్తున్నారు. 1892-93 నాటి డాక్యుమెంట్లు, 1960ల నాటి యుద్ధ కాలంలో నాశనమైన ఫ్యాక్టరీల వివరాలు ఆయన వద్ద ఉన్నాయి. బెంగాల్‌లో ఒకప్పుడు 400 మంది పనిచేసే అగ్గిపెట్టెల పరిశ్రమ ఉండేదని ఆయన గుర్తుచేస్తున్నారు.
బెంగాల్ నుంచి శివకాశికి..
ఒకప్పుడు బెంగాల్‌లోనే పునాదులు పడిన ఈ పరిశ్రమ, కాలక్రమేణా తమిళనాడులోని శివకాశికి ఎందుకు మారిందో సౌవిక్ వివరిస్తారు. 1920లలో శివకాశి పారిశ్రామికవేత్తలు కోల్‌కతాకు వచ్చి ఇక్కడ తయారీని నేర్చుకున్నారు. తక్కువ కూలీ, మెరుగైన ముద్రణ వ్యవస్థ, పంపిణీ నెట్‌వర్క్ ఉండటంతో, శివకాశి ఈ వ్యాపారాన్ని పూర్తిగా కైవసం చేసుకుంది. ఇది బెంగాల్‌లోని పరిశ్రమ పతనానికి దారితీసింది.
కళాఖండాలుగా మారిన అగ్గిపెట్టెల బొమ్మలు
ఈ చిన్న అగ్గిపెట్టెలు కాలక్రమేణా భారతదేశ సామాజిక మార్పులకు అద్దం పట్టాయి. రాజా రవివర్మ చిత్రలేఖనాల నుంచి వందేమాతరం నినాదాలు, అశోక చక్రం, కోల్‌కతా ట్రామ్స్, చారిత్రక కట్టడాల వరకు ప్రతిదీ వీటిపై ముద్రితమయ్యేవి. ఇవి కేవలం అగ్గిపెట్టెలు కావు.. చిన్న కాన్వాస్‌లపై గీసిన భారతదేశ సామాజిక చరిత్ర అని ఆయన చెబుతారు.

ప్రభుత్వ గుర్తింపు కోరుతున్న చరిత్రకారుడు
30,000 అగ్గిపెట్టెలు ఉన్నాయన్న గర్వం ఆయనకు లేదు. తన సేకరణకు ప్రభుత్వ మద్దతు లభిస్తే, ఆ సామాజిక చరిత్రను భావితరాలకు భద్రపరచవచ్చని ఆయన ఆశిస్తున్నారు. సంఖ్య కంటే కూడా, ఆ వస్తువులను ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆర్కైవ్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని సౌవిక్ రాయ్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పోలీసులకు చిక్కలేదు.. బాలీవుడ్‌కు దొరకలేదు!


