ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం  | Vikram Misri briefs media on Operation Sindoor missile strike | Sakshi
Sakshi News home page

ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం 

May 8 2025 2:58 AM | Updated on May 8 2025 2:58 AM

Vikram Misri briefs media on Operation Sindoor missile strike

సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం 

ఇవి ‘బాధ్యతాయుతమైన’ దాడులు 

భారత వైఖరిని స్పష్టంచేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ

మహిళా సైన్యాధికారులతో మీడియా సమక్షంలో నారీశక్తిని చాటిన భారత్‌  

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్‌ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్‌ మిస్రీ మాట్లాడారు. 

‘‘ ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం.

 సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. 

భారత్‌ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్‌ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్‌ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు.  

నారీశక్తి.. నాయకత్వం 
‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాడి వివరాలను ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్‌ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్‌ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్‌ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. 

ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్‌ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్‌ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్‌ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్‌ కమాండర్‌ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్‌ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. 

‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్‌ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్‌లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్‌మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్‌ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. 

ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్‌ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్‌ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్‌’’ అని వ్యోమికా సింగ్‌ తన మీడియా బ్రీఫింగ్‌ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్‌. కీలక ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement