న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు అనంతరం అమెరికా రాయబార కార్యాలయం జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
‘2025, నవంబర్ 10న మధ్య ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారు పేలిపోయిందని స్థానిక మీడియా నివేదించింది. పేలుడుకు కారణం తెలియనప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాలను హై అలర్ట్‌లో ఉంచింది’ అని తెలియజేస్తూ అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా సూచనలు జారీచేసింది. అవి..
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగకండి.
గుంపులు గుంపులుగా ఏర్పడకండి.
అప్‌డేట్‌ల కోసం మీడియాను చూస్తుండండి.
మీ పరిసరాలను జాగ్రత్తగా గమనించండి.
పర్యాటకులు వచ్చే ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండండి.
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారును శక్తివంతమైన పేలుడు తునాతునకలు చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో చాలా వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ‘ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. ఈ ప్రమాదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు.
ఇది కూడా చదవండి: తలొగ్గిన ట్రంప్.. ‘భారత్‌తో న్యాయమైన ఒప్పందం’


