మోదీకి తృణమూల్ కాంగ్రెస్ సవాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, అవినీతిపరులు స్వాహా చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన మొత్తం నిధుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించగలరా? అని మోదీకి సవాలు విసిరింది. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేసింది.
2021 నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని పేర్కొంది. ‘‘రాజకీయ పర్యాటకుడు నరేంద్ర మోదీ బెంగాల్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా? అయితే, పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి దక్కాల్సిన రూ.24,275 కోట్ల నిధులు ఇవ్వకుండా ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కొనసాగించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలియజేసింది. బీజేపీ వాషింగ్ మిషన్‌గా మారినట్లు తృణమూల్ విమర్శించింది. అవినీ తిపరులు ఆ పార్టీలో చేరగానే పరిశుద్ధులు అయిపోతున్నారని ఎద్దేవా చేసింది.


