‘టైగర్‌ మ్యాన్‌’: వాల్మీకి థాపర్‌ కన్నుమూత | Tiger Man Valmik Thapar Passed Away | Sakshi
Sakshi News home page

‘టైగర్‌ మ్యాన్‌’: వాల్మీకి థాపర్‌ కన్నుమూత

Jun 1 2025 6:36 AM | Updated on Jun 1 2025 11:50 AM

Tiger Man Valmik Thapar Passed Away

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్య మకారుడు, టైగర్‌ మ్యాన్‌గా పేరున్న వాల్మీకి థాపర్‌(73) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడు తున్న ఆయన శనివారం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్‌లోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. వన్యప్రాణుల సంరక్షణ, ప్రత్యేకించి పులులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించారు. అటవీ సంరక్షణలో ప్రజలను మమేకం చేసే లక్ష్యంతో 1988లో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ రణథంబోర్‌ ఫౌండేషన్‌కు థాపర్‌ సహ వ్యవస్థాపకుడు. సహజంగా సంచరించే ప్రాంతాల్లో పులులను అక్రమంగా వేటాడటంపై ఆయన ఉద్యమించారు. 

మానవ జోక్యాన్ని అడ్డుకు నేలా ప్రత్యేక టైగర్‌ జోన్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సారథ్యంలోని నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ వంటి రమారమి 150 ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. వన్యప్రాణుల గురించి టైగర్‌ ఫైర్, లివింగ్‌ విత్‌ టైగర్స్‌ వంటి 30కి పైగా పుస్తకాలను రాశారు. భారతీయ వన్యప్రాణులపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. 2024లో జీవావరణ పరిరక్షకురాలు నేహా సిన్హా తీసిన ‘మై టైగర్‌ ఫ్యామిలీ’అనే డాక్యుమెంటరీలో థాపర్‌ కూడా ఉన్నారు. కాగా, థాపర్‌ తండ్రి రమేశ్‌ థాపర్‌ ప్రముఖ జర్నలిస్ట్‌. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శశి కపూర్‌ కుమార్తె సంజనా కపూర్, వాల్మీకి థాపర్‌ దంపతులు కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement