ఐఫోన్ చోరీకి గురైంది. ఆ అమ్మాయి చాలా బాధపడింది. అయితే నెల రోజుల తర్వాత అదే ఫోన్ నుంచి ఆమెకో మెసేజ్ వచ్చింది. ‘నీ ఐఫోన్ పాస్‌వర్డ్ ఏంటో త్వరగా చెప్పు?’అని. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అతని నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కు చెందిన కౌశికీ ధ్యాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ రీల్ వైరల్ అవుతోంది. అందులో ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పమంటూ అడిగాడు. దానికి ఆమె ఆ ఫోన్ పోయింది కదా.. దయచేసి వెనక్కి ఇచ్చేయ్ భయ్యా అంటూ బతిమాలింది. అయితే అతను మాత్రం కన్ఫర్మేషన్ కోసం చేశానంటూ బదులిచ్చాడు.. అతను ఎవరనే మిస్టరీ మాత్రం కంటిన్యూ అయ్యింది. ఇందుకు సంబంధించిన చాటింగ్ స్క్రీన్‌షాట్ బయటకు రావడంతో.. ఆ చిలిపి దొంగ కథ వైరల్ అయ్యింది.
కౌశికీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్‌లోని క్లెమెంట్ టౌన్‌లో సెప్టెంబర్ 12న చోరీ జరిగింది. ఆమె ఐఫోన్‌తో పాటు తన స్నేహితుడి సోదరుడు సాక్షం నేగి ఫోన్లు, మరికొందరి మొబైళ్లు చోరీకి గురయ్యాయి. అదే ప్రాంతంలోని ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు కలిపి లక్షల రూపాయల సొత్తు చోరీ అయినట్లు ఆమె పేర్కొన్నారు.
అందునా ఒకే భవనంలో 5–6 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ అయ్యాయని కౌశికీ ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే రోజు సమీపంలోని పీజీలు, హాస్టళ్లలోనూ చోరీలు జరిగాయని.. ఫిర్యాదులు చేసినా పోలీసులు అలసత్వం ప్రదర్శించారని అన్నారామె.
అయితే కౌశికీకి ఎదురైన అనుభవమే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆసక్తికరంగా మారింది. చోరీకి గురైన ఐఫోన్‌లో ఆమె కాంటాక్ట్ నంబర్ కనిపించేలా ఉండటంతో.. ఫోన్ చేతికి వచ్చిన వ్యక్తి తనను కాంటాక్ట్ అయ్యాడని ఆమె తెలిపారు. తర్వాత తనకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని.. అందులో ఐఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని కోరారని చెప్పారు.
అంతేకాదు.. చోరీపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని కౌశికీ ఆరోపించారు. స్టేషన్‌లో ఎవరూ అందుబాటులో లేరని చెప్పి తర్వాత రావాలని సూచించారని ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదులు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ‘పోలీసులు తమను పట్టుకోలేరనే ధీమాతో దొంగలు భయపడటం లేదు’ అంటూ ఆమె తన సోషల్ మీడియా పోస్టులో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు విస్మరించలేదని డెహ్రాడూన్ సిటీ ఎస్పీ శేఖర్ సుయల్ తెలిపారు. కేసుపై సర్కిల్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: విమానంపై పడ్డ పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!


