డీఎంకే స్టాలిన్‌కు బిగ్‌ షాక్‌ | Tamil Politics MDMK Vaiko Meets Vijay And Praises Questions for DMK | Sakshi
Sakshi News home page

డీఎంకే స్టాలిన్‌కు బిగ్‌ షాక్‌

Jun 18 2026 12:46 PM | Updated on Jun 18 2026 1:30 PM

Tamil Politics MDMK Vaiko Meets Vijay And Praises Questions for DMK

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రుడిగా భావించే ఎండీఎంకే (MDMK) అధినేత వైకో, టీవీకే (TVK) అధినేత విజయ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, విజయ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, రాబోయే ఎన్నికల్లో టీవీకే ఆశ్చర్యకర ఫలితాలు సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. దీంతో, వైకో వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

విజయ్‌ను కలిసిన వైకో.. 
తాజాగా వైకో, విజయ్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌ రాజకీయ భవిష్యత్తుపై వైకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఇప్పటికే ఒక శక్తిగా అవతరించిందని, యువత, మహిళలు, తొలి ఓటర్లలో విజయ్‌కు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. అలాగే, టీవీకే భవిష్యత్తులో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలదు. రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

డీఎంకే కూటమికి గుడ్‌బై?
1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్‌ ప్రొ‍గ్రెసివ్‌ అలయన్స్‌తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఎన్నికల్లో ఒక చోట విజయం సాధించారు. అయితే, గత కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. వైకో కుమారుడు, పార్టీ కీలక నేత దురై వైకో కూడా ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.

ఇక, వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్‌ను బహిరంగంగా ప్రశంసించడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఆయన.. డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేకు చేరితే, అది స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. అదే సమయంలో విజయ్ పార్టీకి ద్రవిడ రాజకీయాల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.

అయితే, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో సంప్రదాయ డీఎంకే-ఏఐఏడీఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లలో విజయ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా పలు చిన్న, మధ్య తరహా పార్టీలు కూడా టీవీకే వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకో భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా? లేక భవిష్యత్తు రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎమ్మెల్యే రాజీనామా?
ఇటీవల చెన్నైలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆదవ్ అర్జునా వైకోను కలవగా, మరుసటి రోజు సీఎం విజయ్‌తో వైకో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే ఈ భేటీ పూర్తిగా రాజకీయ అంశాలపై కేంద్రీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా కూటమి మార్పుపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే డీఎంకే గుర్తుపై పోటీ చేసి గెలిచినందున తక్షణమే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే రాజీనామాలపై ఆలోచన జరుగుతోందన్న సమాచారం కూడా పార్టీ వర్గాల నుంచి వెలువడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement