ఆడ శిశువుపై తొలగని వివక్ష | Supreme Court Calls For Strict Enforcement Of Sex-Selection Prohibition | Sakshi
Sakshi News home page

ఆడ శిశువుపై తొలగని వివక్ష

Jun 12 2026 5:43 AM | Updated on Jun 12 2026 6:21 AM

Supreme Court Calls For Strict Enforcement Of Sex-Selection Prohibition

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి

అప్పటి దాకా పీఎన్‌పీఎన్‌డీటీ  చట్టాన్ని అమలు చేయాలి

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మన పితృస్వామ్య వ్యవస్థలో మగ సంతానంపై ఇప్పటికీ తగ్గని ఆసక్తిని, తెరవెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలను సుప్రీంకోర్టు తీవ్రంగా నిరసించింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రానంతవరకు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ (ప్రీ కాన్సెప్షన్‌ అండ్‌ ప్రీ నాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్, పీసీపీఎన్‌డీటీ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంది. 

పితృస్వామ్య పోకడలున్న మన వ్యవస్థలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేందుకు వారి కోసం అమలవుతున్న.. బేటీ బచావో బేటీ పఢావో, జనని సురక్షా యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలే నిదర్శనమని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ల ధర్మాసనం గురువారం తెలిపింది.

 ఇలాంటి పథకాలతో అభివృద్ధి జరిగినప్పటికీ, ఆశించిన ప్రయోజనాలు ఇంకా రావాల్సి ఉందని అభిప్రాయ పడింది. ‘మహిళలను చులకనగా చూడటం మానేసి, వారిని కూడా సమానులుగా భావించే పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి ప్రత్యేక ప్రయత్నాలు/ పథకాల అవసరం ఇక ఎంతమాత్రం లేదు అనే స్పృహ సమాజంలో కలిగినప్పుడే సంపూర్ణ మార్పు వచ్చినట్లు భావించాలి. అంటే ఐపిసి, బిఎన్‌ఎస్‌ వంటి చట్టాల ద్వారా మహిళలకు కల్పిస్తున్న రక్షణలు ఇకపై అవసరం లేదని కాదు. 

కనీసం పుట్టిన ఆడబిడ్డను స్వాగతించే పరిస్థితి రావాలి’అని ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఆడ శిశువులు నమోదువుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో జాతీయ బాలల లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకు 1991లో 945 కాగా, 2011 నాటికి 919కి పడిపోవడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. 

గర్భస్థ శిశు లింగ నిర్థారణ చట్టం పీసీపీఎన్‌డీటీని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుత పరిస్థితి ఫరవాలేదు. ఇంకా మెరుగుపర్చేందుకు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన ఆర్టీసీ బస్సులపై ఆడబిడ్డ విద్య, అభ్యున్నతి, ఆర్థిక భద్రతకు సంబంధించిన పోస్టర్లతో ప్రచారాలు కొనసాగించాల్సి వస్తోంది’అని వ్యాఖ్యానించింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కోర్టు దర్యాప్తును సవాల్‌ చేస్తూ ఓ వైద్యుడు వేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement