నిఠారీ హత్యల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
కిందికోర్టు విధించిన శిక్ష, జరిమానా రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో దోషిగా తేలిన సురేంద్ర కోలీని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతడు జైలు నుంచి విడుదలయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. నిఠారీ హత్యల కేసులో తనను దోషిగా తేల్చడాన్ని సవాలు చేస్తూ సురేంద్ర కోలీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో అతడికి విధించిన శిక్షను, జరిమానాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కో లీపై ఇతర కేసులు గానీ, విచారణ గానీ లేకుంటే తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
హంతకులెవరో ఇప్పటికీ తెలియకపోవడం విచారకరం
నిఠారీ వరుస హత్యల వెనుక అసలు సూత్రధారులను గుర్తించలేకపోవడం తీవ్ర విచారకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుదీర్ఘకాలం విచారణ జరిగినప్పటికీ హంతకులెవరో ఇప్పటికీ నిర్ధారణ కాలేదని వెల్లడించింది. పోలీసులు ఇంతకాలం శ్రమించినా నేరస్థులను పట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించింది. అభంశుభం తెలియని, చిన్నారులను హత్యచేయడం చాలా ఘోరమని, వారి తల్లిదండ్రుల ఆవేదనను వర్ణించలేమని స్పష్టంచేసింది. కేవ లం ఊహాగానాల ఆధారంగా ఒకరిని దోషిగా తేల్చడాన్ని ‘క్రిమినల్ లా’ అంగీకరించబోదని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. అస్థిపంజరాలు దొరికిన ఘటనా స్థలాన్ని సరిగ్గా సంరక్షించలేదని, ఆ తర్వాత హడావుడిగా తవ్వకాలు చేపట్టారని అసంతృప్తి వ్యక్తంచేసింది. కేసు దర్యాప్తులో అధికారులు కీలకమైన విషయాలను విస్మరించారని తప్పుపట్టింది.
ఏమిటీ కేసు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నిఠారీ అనే ప్రాంతంలో 2006 డిసెంబర్ 29న వ్యాపారవేత్త మనీందర్ సింగ్ ఇంటి వెనుక మురికి కాలువలో ఎనిమిది అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవన్నీ చిన్నారులకు సంబంధించినవే. మనీందర్ సింగ్ ఇంట్లో సురేంద్ర కోలీ సహాయకుడిగా పని చేస్తుండేవాడు. ఎనిమిది అస్థిపంజరాల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలికలను లైంగికంగా వేధించి, హత్య చేసి మురికికాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సురేంద్ర కోలీని కింది కోర్టు దోషిగా గుర్తించింది.
మరణశిక్ష విధించింది. దీన్ని 2011 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. 2015 జనవరిలో అలహాబాద్ హైకోర్టు ఈ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2023 అక్టోబర్‌లో నిఠారీకి సంబంధించిన ఇతర హత్యల కేసుల్లో కోలీని, సహ నిందితుడు మనీందర్ సింగ్‌ను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోలీకి మొత్తం 12 కేసుల్లో విముక్తి లభించింది. మరో హత్య కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన శిక్ష, జరిమానాను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. వంట గదిలో దొరికిన కత్తి ఆధారంగానే దర్యాప్తు జరిగిందని, కోలీని దోషిగా నిర్ధారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.


