తిరువనంతపురం: కేరళలో మత్తుపదార్థాల మహమ్మారిని అంతమొందించేందుకు కేరళ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాంటీ-డ్రగ్ డ్రైవ్ ‘ఆపరేషన్ తుఫాన్’ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. మత్తు ముఠాల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సాగుతున్న ఈ మహా యుద్ధంలోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వయంగా అడుగుపెట్టారు. తాను కూడా ఒక ‘తుఫాన్ వారియర్’గా మారుతున్నట్లు ప్రకటిస్తూ, కేరళ పోలీస్ విభాగానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.
డ్రగ్స్ మాఫియాపై మహా యుద్ధం
‘ఆపరేషన్ తుఫాన్ - ద నార్కో హంట్’ పేరుతో కేరళలో సాగుతున్న ఈ భారీ ఆపరేషన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోహన్‌లాల్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నెట్‌వర్క్‌ను సమూలంగా పాతరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పోరాటంలో తాను భాగం కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తుడిచిపెట్టేందుకు కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితలతో మోహన్‌లాల్ ప్రత్యేకంగా సమావేశమై, ఈ పోరాటం కేరళ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
హోంమంత్రితో భేటీ..
ఈ భేటీ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు చేపట్టాలని తాను ఎన్నేళ్లుగానో కోరుకుంటున్నానని హోంమంత్రి రమేష్ చెన్నితలకు వివరించారు. ఈ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, దీనివల్ల వేలాది కుటుంబాలు, విద్యార్థుల జీవితాలు నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఒక ‘తుఫాన్’లాగా మారి డ్రగ్స్ మాఫియాను తుడిచిపెట్టేయాలని ఆయన కోరుకున్నారు. ఇదే సమయంలో విశ్వశాంతి ఫౌండేషన్ తరపున తాము రూపొందించిన 'బీ ఏ హీరో, సే నో టు డ్రగ్స్' ప్రాజెక్ట్ వివరాలను హోంమంత్రికి తెలియజేస్తూ, పోలీసులకు ఎలాంటి సహాయం చేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ధరలు తగ్గించడం కుదరదు: సురేష్ గోపి


