ట్రంప్‌ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా? | Fact Or Bluff? Trump’s Claim Of Secret Operation Under Iran’s Nose In The Strait Of Hormuz | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 9:48 AM

Fact or Bluff Trumps Secret Op Under Irans Nose At Hormuz

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ కళ్లుగప్పి హర్ముజ్‌ జలసంధిలో ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్‌ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్‌ దాటించామని వెల్లడించారు.

ట్రూత్‌ సోషల్‌ వేదికగా స్పందించిన ట్రంప్‌.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్‌ ఫలితంగా 100 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్‌కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.

అమెరికా కారణంగానే హర్ముజ్‌ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. "హర్ముజ్‌ను నియంత్రించేది ఇరాన్‌ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్‌ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్‌ ట్రాకింగ్‌కు చిక్కకుండా హర్ముజ్‌ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్‌ చెప్పినట్లుగా ఇరాన్‌ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.

అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో ఒమన్‌ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్‌ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.

ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్‌ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్‌-లెబనాన్‌ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్‌ జలసంధిలో 100 మిలియన్‌ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్‌ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. 

ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్‌ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్‌ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్‌ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్‌ కళ్లు గప్పి భారీ ఆపరేషన్‌ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్‌ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్‌ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement