మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లోని సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం దృశ్యం 3, మే 21న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 236 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అయినప్పటికీ నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 18 నుంచి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది.
దృశ్యం 3 కథేంటంటే..?
దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.
కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


