సినిమా తెరపై దశాబ్దాల పాటు ‘దళపతి’గా అభిమానులను ఊర్రూతలూగించిన సి. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై అందరికీ సందేహాలే!. ‘‘రాజకీయాలు తెలియదు’’, “ఎలాంటి అనుభవం లేదు”, “పాలన అంటే సినిమా చేయడం కాదు” ఇలా.. ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమిళనాడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది నెలల్లోనే.. విజయ్ తనపై ఉన్న ఆ అనుమానాలనే లక్ష్యంగా చేసుకుని ఒక్కో అడుగుతో సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది.
మొదట్లోనే ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయాల కంటే పాలనపైనే ఫోకస్ పెట్టినట్టు సంకేతాలు ఇచ్చాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనతో కోట్లాది కుటుంబాలకు నేరుగా ఊరట కలిగించారు. అదే సమయంలో ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా “సింగప్పెన్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయడం మరో కీలక నిర్ణయంగా మారింది.
వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ మద్యం దుకాణాల(TASMAC) విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న దుకాణాలను దశలవారీగా మూసివేయడం ద్వారా “పాలనలో కఠినత” అనే సందేశాన్ని బలంగా పంపింది.
అయితే విజయ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది కేవలం నిర్ణయాలు కాదు.. ఆ వెనుక ఉన్న “పాలనా శైలి”. ప్రతి రోజు సమయానికి సచివాలయానికి చేరుకోవడం, గంటల తరబడి ఫైళ్లపై దృష్టి పెట్టడం, అధికారులపై క్రమశిక్షణను తప్పనిసరి చేయడం వంటి అంశాలు కొత్త చర్చకు దారితీశాయి. సంప్రదాయ రాజకీయ నేతలలా కాకుండా, ఆయన కార్పొరేట్ సీఈఓ తరహాలో పాలన నడుపుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.
అంతేకాదు, వ్యక్తిగత అలవాట్లు కూడా ఈ కథనంలో భాగమయ్యాయి. టైం కంటే ముందే ‘ఆఫీస్’కు వెళ్తున్న ఆయన.. సాదాసీదాగా సెక్రటేరియెట్‌లోని తన ఛాంబర్ భోజనం చేయడం, అనవసర రాజకీయ సమావేశాలను తగ్గించడం వంటి విషయాలు ఆయన “డిసిప్లిన్ ఫస్ట్” పాలనా విధానానికి ఉదాహరణలుగా చెబుతున్నారు. అధికార వర్గాల్లో సమయపాలనను కఠినంగా అమలు చేయడం కూడా అదే దిశలోని సంకేతం.
విజయ్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే కాదు, వ్యవస్థ మార్పుపై కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అమ్మా ఉణవగం క్యాంటీన్ల ఆధునీకరణ, నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక ప్యాకేజీలు వంటి నిర్ణయాలు ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక పారదర్శకత కోసం ఫైనాన్స్ వైట్‌పేపర్ విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది.
రాజకీయంగా చూస్తే కేంద్రంతో ఆయన వైఖరి కూడా సమతుల్యంగానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా.. తమిళనాడు ప్రయోజనాలను బలంగా వినిపిస్తూనే, కేంద్రంతో విభేదాలను పెద్దగా పెంచకుండా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
మరో కీలక అంశం.. అవినీతి వ్యతిరేక చర్యలు. హెచ్‌ఆర్&సీఈ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులను రద్దు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను కఠినతరం చేయడం, కాంట్రాక్ట్ వ్యవస్థపై నియంత్రణ పెంచడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఈ కథ ఇంకా పూర్తికాలేదు. కొన్ని ఎన్నికల హామీలు అమలు దశలోనే ఉన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అనుభవం లోపం, పాలనా స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. విమర్శలు తగ్గకపోయినా, వాటికి సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, నిర్ణయాలతో వస్తోంది.
సినిమాల్లో ఎలా అయితే ప్రతి సన్నివేశానికి ఒక క్లైమాక్స్ ఉంటుందో, రాజకీయాల్లో విజయ్ కూడా తన పాలనను అదే తరహాలో “పర్ఫార్మెన్స్ మోడ్”లో నడుపుతున్నాడన్న భావన బలపడుతోంది. ఇది తాత్కాలిక ఉత్సాహమా? లేక స్థిరమైన రాజకీయ మార్పుకు ఆరంభమా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి.


