కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే కాంగ్రెస్ అసలైన బలం | Worker is the backbone of Congress party success: Minister Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే కాంగ్రెస్ అసలైన బలం

Aug 17 2026 10:30 PM | Updated on Aug 17 2026 10:30 PM

Worker is the backbone of Congress party success: Minister Uttam Kumar Reddy

సాక్షి,భువనగిరి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయాల వెనుక నిలిచేది కార్యకర్తేనని.. ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో పార్టీ జెండా నేలవాలకుండా కాపాడేదీ కార్యకర్తేనని.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల గడపకు చేర్చే వారధి కూడా కార్యకర్తేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని విశ్వసించి, పార్టీ జెండాను భుజాన మోసి, ప్రజల మధ్య నిలిచిన నిబద్ధత కలిగిన కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎన్నటికీ విస్మరించదని స్పష్టం చేశారు.

భువనగిరిలో సోమవారం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.

తాను సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో గ్రామస్థాయి కార్యకర్తల కష్టాన్ని అత్యంత దగ్గరగా చూశానని చెప్పారు. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని, అధికారానికి దూరంగా ఉన్న సమయంలోనూ ప్రజల మధ్య పార్టీ ఉనికిని కాపాడారని గుర్తు చేశారు. “ప్రభుత్వాలు వస్తాయి... పదవులు వస్తాయి... పోతాయి. కానీ ప్రజల మధ్య పార్టీ జెండాను మోస్తూ, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో సజీవంగా ఉంచేది కార్యకర్తే. కాంగ్రెస్ కార్యకర్తే మన అసలైన బలం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అయితే వాటి అసలైన ప్రయోజనం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలంటే పార్టీ యంత్రాంగం, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉచిత సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అందిస్తున్న విస్తృత సహాయం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు.

“ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుంది... కార్యకర్త దాని సందేశాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్తాడు. ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తుంది... దాని ఫలం అర్హుడి గడపకు చేరిందో లేదో తెలుసుకునేది కార్యకర్త. ప్రభుత్వం–ప్రజల మధ్య సజీవమైన వారధి కాంగ్రెస్ కార్యకర్త” అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మండల, గ్రామ, బూత్ స్థాయి కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు.

తెలంగాణలో ఆహార భద్రతకు కొత్త నిర్వచనం
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆహార భద్రతా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 85 శాతం మందికి సమానమైన 3.42 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. “నా ఇంట్లో నేను తినే నాణ్యమైన బియ్యమే నిరుపేద కుటుంబం కూడా తినాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. పేదరికం కారణంగా ఆహార నాణ్యతలో తేడా ఉండకూడదు. ఇది కేవలం బియ్యం పంపిణీ కాదు... పేదవాడి ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం” అని అన్నారు.

గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించే దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం అందించడం ద్వారా ఆహార భద్రతకు నాణ్యత, గౌరవాన్ని జోడించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2.80 కోట్ల మందికి ఉన్న ఆహార భద్రతా పరిధిని 3.42 కోట్ల మందికి విస్తరించామని తెలిపారు. దేశంలో హక్కుల ఆధారిత ఆహార భద్రతా వ్యవస్థకు బాటలు వేసింది సోనియా గాంధీ అని గుర్తు చేస్తూ, ఆహార భద్రతా చట్టం ఆమె దూరదృష్టికి ప్రతిరూపమన్నారు. ఆ స్ఫూర్తినే తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు. “నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశాల్లో 3.42 కోట్ల మందికి నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించడం ఒకటి. సమ్మిళిత సంక్షేమానికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.

1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు -పారదర్శకతకు కొత్త చిరునామా
తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో సుమారు 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశం మరో చారిత్రాత్మక సంస్కరణ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. QR కోడ్‌తో కూడిన ఈ కార్డుల ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు కుటుంబ వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ పరిధిలో పోర్టబిలిటీ సౌకర్యం ఉండడం వల్ల ఉపాధి కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, చౌకధరల దుకాణాల వారీగా దశలవారీగా కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.

ధాన్యోత్పత్తిలో తెలంగాణ శక్తిమంతమైన రాష్ట్రం
ఒకవైపు పేదలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పిస్తూనే మరోవైపు ఆ అన్నాన్ని పండించే రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రశ్రేణి వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందన్నారు. ఇటీవల సీజన్‌లో సుమారు 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సుమారు రూ.90 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తులకు తావులేకుండా రైతు పండించిన ప్రతి గింజకు తగిన ప్రతిఫలం నేరుగా రైతుకే అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వర్షాభావంపై అప్రమత్తం... తాగునీటికే తొలి ప్రాధాన్యం
రాష్ట్రంలో నెలకొన్న వర్షపాతం లోటు పరిస్థితులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వర్షపాతం, జలాశయాల్లో నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో భద్రపరిచిన తర్వాతే అందుబాటులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగునీటి విడుదలపై శాస్త్రీయ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “ప్రజల గొంతు తడపడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత. వచ్చే వేసవికి అవసరమైన తాగునీటిని పూర్తిగా భద్రపరచాలన్నది మా విధాన నిర్ణయం. ఆ తర్వాత మిగిలిన నీటి లభ్యతను బట్టి సాగునీటిని సమతుల్యంగా, శాస్త్రీయంగా ప్రణాళిక చేస్తాం” అని తెలిపారు.

ప్రస్తుత జల పరిస్థితులను రైతులకు వివరించడంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని కోరారు. రాబోయే వారాల్లో మెరుగైన వర్షాలు కురిస్తే పరిస్థితి ఆశాజనకంగా మారుతుందని, అయినప్పటికీ నీటి నిర్వహణలో శాస్త్రీయ దృక్పథం, ముందు జాగ్రత్తే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

బస్వాపూర్ నుంచి డిండి వరకు... సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తాం
బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, డిండి సహా కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రాధాన్యతా పనులను వేగవంతం చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కచ్చితమైన సమాచారం, శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా సాగునీటి నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను తెలుసుకుంటున్న ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అగ్రనాయకత్వం నేరుగా సామాన్య కార్యకర్త వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను వినడం పార్టీ శ్రేణుల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగితే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. “గౌరవం పొందిన కార్యకర్త... ఉత్సాహంతో పనిచేసే కార్యకర్త... ప్రజల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద రాయబారని, కార్యకర్తను గౌరవిస్తే పార్టీ బలపడుతుందని, పార్టీ బలపడితే ప్రజలతో ప్రభుత్వ బంధం మరింత దృఢమవుతుంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్. పద్మావతి రెడ్డి, మందుల సామేల్తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement