సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల గడువు విధిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టును రిఫరెన్స్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలాంటి గడువులు ఉండబోవని తమ అభిప్రాయం వెల్లడించింది.
‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై కోర్టులు గడువు నిర్దేశించలేవు. గవర్నర్ బిల్లును ఆమోదించేందుకు రాజ్యాంగంలో ఏ సమయ పరిమితి (టైమ్‌లైన్) లేదు. అయితే.. గవర్నర్లు బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుంటే మాత్రం న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు ఉంటుంది. మేము గవర్నర్‌కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం. గవర్నర్ ముందు మూడే మార్గాలు ఉన్నాయి.. ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఈ మూడు మార్గాలను ఎంపిక చేయడంలో మాత్రమే గవర్నర్ విచక్షణ ఉంది’’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

అసెంబ్లీ బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెడుతుండడం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని.. లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా భాగం అయ్యారు. అయితే..
గడువుపై పిటిషన్లను సుప్రీం కోర్టు అనుమతించలేదు. దీంతో ఈ తీర్పుపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద అధికారాలపై ఆరా తీసిన ఆమె.. సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదనొచ్చా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి రిఫరెన్స్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. ఈ బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు.
సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నలు..
1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును గవర్నర్‌కు సమర్పించినప్పుడు అతని ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ తన వద్ద ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకుంటూ మంత్రి మండలి అందించే సహాయం & సలహాలకు కట్టుబడి ఉంటారా?
3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణను ఉపయోగించడం న్యాయబద్ధమైనదా?
4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు సంపూర్ణ అడ్డంకిగా ఉందా?
5. రాజ్యాంగబద్ధంగా సూచించబడిన కాలపరిమితి మరియు గవర్నర్ అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, గవర్నర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద ఉన్న అన్ని అధికారాలను వినియోగించడానికి కాలక్రమాలను విధించవచ్చా మరియు న్యాయపరమైన ఆదేశాల ద్వారా వ్యాయామ విధానాన్ని సూచించవచ్చా?
6. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణను వినియోగించడం న్యాయబద్ధమైనదేనా?
7. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన కాలక్రమం మరియు రాష్ట్రపతి అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణను వినియోగించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలక్రమాలను విధించవచ్చా మరియు ఆ విధానాన్ని నిర్దేశించవచ్చా?
8. రాష్ట్రపతి అధికారాలను నియంత్రించే రాజ్యాంగ పథకం దృష్ట్యా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సూచన ద్వారా సుప్రీంకోర్టు సలహా కోరడం మరియు గవర్నర్ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవడం అవసరమా?
9. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతి నిర్ణయాలు చట్టానికి ముందు దశలో న్యాయబద్ధమైనవేనా? బిల్లు చట్టంగా మారడానికి ముందు, దాని విషయాలపై కోర్టులు న్యాయపరమైన తీర్పును చేపట్టడానికి అనుమతి ఉందా?
10. రాజ్యాంగ అధికారాలను మరియు రాష్ట్రపతి/గవర్నర్ ఆదేశాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఏ విధంగానైనా భర్తీ చేయవచ్చా?
11. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద మంజూరు చేయబడిన గవర్నర్ అనుమతి లేకుండా అమలులో ఉన్న చట్టమా?
12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) నిబంధన దృష్ట్యా, ఈ గౌరవనీయ న్యాయస్థానంలోని ఏ బెంచ్ అయినా ముందుగా దాని ముందు విచారణలో ఉన్న ప్రశ్న రాజ్యాంగ వివరణకు సంబంధించిన చట్టపరమైన గణనీయమైన ప్రశ్నలను కలిగి ఉందో లేదో నిర్ణయించడం మరియు దానిని కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు సూచించడం తప్పనిసరి కాదా?
13. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు యొక్క అధికారాలు విధానపరమైన చట్టం లేదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అంశాలకు పరిమితం చేయబడతాయా లేదా రాజ్యాంగం లేదా అమలులో ఉన్న చట్టం యొక్క ప్రస్తుత ముఖ్యమైన లేదా విధానపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలు/ఆదేశాలను జారీ చేయడం వరకు విస్తరించిందా?
14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా తప్ప, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క ఏదైనా ఇతర అధికార పరిధిని రాజ్యాంగం నిషేధిస్తుందా?
న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం తమ పరిధి అతిక్రమించడమేనన్న కేంద్రం వాదించింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు పెట్టడం సరైనని సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి. నవంబర్ 23న చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా తీర్పుపై దేశం ఉత్కంఠగా ఎదురు చూసింది.


