breaking news
article 143(1)
-
గడువు విధించలేం.. నాలుగో అధికారం ఉండదు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల గడువు విధిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టును రిఫరెన్స్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలాంటి గడువులు ఉండబోవని.. అయితే అకారణంగా బిల్లుల్ని పెండింగ్‌లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదంటూ తమ అభిప్రాయం వెల్లడించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై కోర్టులు గడువు నిర్దేశించలేవు. గవర్నర్ బిల్లును ఆమోదించేందుకు రాజ్యాంగంలో ఏ సమయ పరిమితి (టైమ్‌లైన్) లేదు. అయితే.. గవర్నర్లు బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుంటే మాత్రం న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు ఉంటుంది. మేము గవర్నర్‌కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం. గవర్నర్ ముందు మూడే మార్గాలు ఉన్నాయి.. ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఈ మూడు మార్గాలను ఎంపిక చేయడంలో మాత్రమే గవర్నర్ విచక్షణ ఉంది. పునఃపరిశీలనకు పంపకపోవడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. నాలుగో అధికారం గవర్నర్లకు ఉండదు. నిరవధిక ఆలస్యం జరిగితే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెడుతుండడం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని.. లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా భాగం అయ్యారు. అయితే.. గడువుపై పిటిషన్లను సుప్రీం కోర్టు అనుమతించలేదు. దీంతో ఈ తీర్పుపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద అధికారాలపై ఆరా తీసిన ఆమె.. సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదనొచ్చా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి రిఫరెన్స్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. ఈ బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు. సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నలు..1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును గవర్నర్‌కు సమర్పించినప్పుడు అతని ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ తన వద్ద ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకుంటూ మంత్రి మండలి అందించే సహాయం & సలహాలకు కట్టుబడి ఉంటారా?3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణను ఉపయోగించడం న్యాయబద్ధమైనదా?4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు సంపూర్ణ అడ్డంకిగా ఉందా?5. రాజ్యాంగబద్ధంగా సూచించబడిన కాలపరిమితి మరియు గవర్నర్ అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, గవర్నర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద ఉన్న అన్ని అధికారాలను వినియోగించడానికి కాలక్రమాలను విధించవచ్చా మరియు న్యాయపరమైన ఆదేశాల ద్వారా వ్యాయామ విధానాన్ని సూచించవచ్చా?6. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణను వినియోగించడం న్యాయబద్ధమైనదేనా?7. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన కాలక్రమం మరియు రాష్ట్రపతి అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణను వినియోగించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలక్రమాలను విధించవచ్చా మరియు ఆ విధానాన్ని నిర్దేశించవచ్చా?8. రాష్ట్రపతి అధికారాలను నియంత్రించే రాజ్యాంగ పథకం దృష్ట్యా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సూచన ద్వారా సుప్రీంకోర్టు సలహా కోరడం మరియు గవర్నర్ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవడం అవసరమా?9. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతి నిర్ణయాలు చట్టానికి ముందు దశలో న్యాయబద్ధమైనవేనా? బిల్లు చట్టంగా మారడానికి ముందు, దాని విషయాలపై కోర్టులు న్యాయపరమైన తీర్పును చేపట్టడానికి అనుమతి ఉందా?10. రాజ్యాంగ అధికారాలను మరియు రాష్ట్రపతి/గవర్నర్ ఆదేశాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఏ విధంగానైనా భర్తీ చేయవచ్చా?11. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద మంజూరు చేయబడిన గవర్నర్ అనుమతి లేకుండా అమలులో ఉన్న చట్టమా?12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) నిబంధన దృష్ట్యా, ఈ గౌరవనీయ న్యాయస్థానంలోని ఏ బెంచ్ అయినా ముందుగా దాని ముందు విచారణలో ఉన్న ప్రశ్న రాజ్యాంగ వివరణకు సంబంధించిన చట్టపరమైన గణనీయమైన ప్రశ్నలను కలిగి ఉందో లేదో నిర్ణయించడం మరియు దానిని కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు సూచించడం తప్పనిసరి కాదా?13. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు యొక్క అధికారాలు విధానపరమైన చట్టం లేదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అంశాలకు పరిమితం చేయబడతాయా లేదా రాజ్యాంగం లేదా అమలులో ఉన్న చట్టం యొక్క ప్రస్తుత ముఖ్యమైన లేదా విధానపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలు/ఆదేశాలను జారీ చేయడం వరకు విస్తరించిందా?14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా తప్ప, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క ఏదైనా ఇతర అధికార పరిధిని రాజ్యాంగం నిషేధిస్తుందా?న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం తమ పరిధి అతిక్రమించడమేనన్న కేంద్రం వాదించింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు పెట్టడం సరైనని సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి.రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పది కీలక అంశాలు1. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై గడువు నిర్దేశించలేం2. గవర్నర్లు బిల్లులు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే రాజ్యాంగ కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉంది3. మేము గవర్నర్ కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం4. గవర్నర్ ముందు మూడే మార్గాలు : ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం.ఈ మూడు మార్గాలను ఎంపిక చేయడంలో మాత్రమే గవర్నర్ విచక్షణ ఉంది5. గవర్నర్ బిల్లును తిరిగి సభకు పంపకుండా నిలిపేయడం సమాఖ్య(ఫెడరల్) స్ఫూర్తిని ఉల్లంఘించడమే. గవర్నర్ బిల్లును సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చని కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరిస్తున్నాము6. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ అధికారం అంటే.. బిల్లును తిరిగి వెనక్కి పంపడం లేకుంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమే7. గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారి రాష్ట్రపతి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిల్లులో స్పష్టత లేకుంటే ,సలహా అవసరమని భావించినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి8. రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాలను ఆర్టికల్ 142 కింద కోర్టులు సబ్‌స్టిట్యూట్ చేయలేవు. ఆర్టికల్ 142 " డీమ్డ్ అస్సెంట్"(ఆమోదం పొందినట్లే) అనే భావనను అనుమతించదు9. ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అమల్లోకి రాదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ , శాసనసభ పాత్రలను మరొక రాజ్యాంగ వ్యవస్థ భర్తీ చేయదు 10. బిల్లుల ఆమోదంపై రాజ్యాంగంలో ఎలాంటి కాల పరిమితి లేదు. ఆర్టికల్ 200 కింద అధికారాలను వినియోగించడానికి కాల పరిమితి నిర్దేశించడం సరికాదు. చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో సమతుల్యత కోసమే ఆర్టికల్ 200, 201 ఏర్పాటు చేశారు. -
బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా?
సుప్రీంకోర్టును అడగాలని రాష్ట్రపతికి ఏబీకే లేఖ సామాజిక బాధ్యత గలవారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? గతంలో పోస్టుకార్డులను కూడా ఫిర్యాదులుగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏపీలో రైతుల ప్రయోజనాల పరిరక్షణలో వైఫల్యం లోకస్ స్టాండి లేదంటూ నా వ్యాజ్యాన్ని తిరస్కరించారు ఏపీ రాజధాని ప్రాంత ఎంపిక కమిటీకి చట్టబద్ధత లేదు ముఖ్యమంత్రి ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలు, జాతీయ వనరుల పరిరక్షణ విషయంలో గతంలో మాదిరిగా సామాజిక బాధ్యతగల వ్యక్తులెవరైనా సుప్రీకోర్టును ఆశ్రయించవచ్చా? లేక బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా? అనే విషయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–143(1) కింద సుప్రీంకోర్టుకు ప్రస్తావించాలని సీనియర్ సంపాదకుడు, ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక లేఖ రాస్తూ... ప్రజాప్రయోజనాలకు సంబంధించి న్యాయవ్యవస్థ, ప్రత్యేకించి సుప్రీంకోర్టు ప్రజలకు చిట్టచివరి ఆశ అని... పోస్ట్కార్డుల్లో వచ్చిన ఫిర్యాదులను కూడా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి అవసరమైన సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తగా, పాత్రికేయులుగా సామాజిక స్పృహ ఉన్న వారెవరైనా సామాన్య ప్రజల లబ్ధికి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తగు తీర్పుల ద్వారా సామాన్యుల ప్రయోజనాలను కాపాడాయని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఆక్షేపించారు. ఏపీలో రైతులు, జాతీయ వనరుల పరిరక్షణలో, వనరులు, కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడంలో సుప్రీంకోర్టు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించారు... రాజధాని నగరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించడాన్ని ప్రశ్నిస్తూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఏబీకే తన లేఖలో రాష్ట్రపతికి తెలిపారు. లోకస్ స్టాండి వంటి సాంకేతిక కారణాలను వెతుకుతూ ప్రజలకు ఉపశమనాన్ని తిరస్కరించిందని పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం నా పిటిషన్‌కు సంబంధించి ఫైలు ఓపెన్ చేయకుండానే భూమిని మీరు పోగొట్టుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘నేను జర్నలిస్టును’ అని చెప్పగానే ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని... రైతులను రానివ్వండి, వస్తే పరిశీలిస్తామని చెప్పారు. మా న్యాయవాది రాజధాని నిర్మాణంలో అవకతవకలను, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావించినప్పుడు.. ఆ అంశాలను కేంద్ర ప్రభుత్వం చూస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు బెదిరింపులు, దాడులకు గురైన వారు. రాజధాని నిర్మాణంలో పారదర్శకత ఉండాలని, అవినీతి రహితంగా ఉండాలని నా ప్రార్థన. కానీ దురదృష్టవశాత్తూ పిటిషన్‌ను తిరస్కరించారు. మేమంతా కూడా ప్రధానంగా రైతు కుటుంబాల వారమే..’ అని ఏబీకే ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం తగు విధంగా విధి నిర్వహణ చేయాల్సిన ప్రధాన న్యాయమూర్తి... తాను రామరాజ్యాన్ని తేలేనని వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా తోటి న్యాయమూర్తుల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారని చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి నూతన రాజధాని ఎంపిక కోసం పలు ప్రత్యామ్నాయాలు పరిశీలించి తగు సిఫార్సులు చేయడానికి శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాజధాని ప్రాంతం ఎంపిక కోసం వ్యాపార లావాదేవీలున్న ఒక మంత్రి, ఇద్దరు టీడీపీ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి కోరికల మేరకే వ్యవహరించిందన్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రాంతాన్ని సూచించే విషయంలో శాసనసభ కానీ ఇతర వాటాదారులకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయించారని లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. ఏపీకి చెందిన ఈ చెల్లని కమిటీ సిఫార్సుల వల్ల 15 లక్షల ఎకరాల సారవంతమైన భూములను దేశం కోల్పోవడమే కాకుండా ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఏబీకే పేర్కొన్నారు.


