
ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
ఆమె ఓ గ్రామ సర్పంచ్. లక్షల్లో అప్పులు చేసింది. అది తీర్చడం కుదరకపోయేసరికి ఏకంగా పంచాయితీనే మరొక వ్యక్తికి లీజు కింద అప్పగించింది. అయితే ఇప్పటికిప్పుడు జరిగిందేం కాదు!. చాలా కాలం కిందటే ఆమె ఇలా కాంట్రాక్ట్ కుదుర్చుకుని పంచాయితీ ఆఫీస్‌ను అతని చేతిలో పెట్టిందట!. ఇదేం పంచాయితీ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.
మధ్యప్రదేశ్ గుణ జిల్లాకు కరోడ్ గ్రామ పంచాయితీలో ఆ ఊరి సర్పంచ్ లక్ష్మీ బాయి సీట్‌లో మరో వ్యక్తి కూర్చోవడం ఉన్నతాధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు గల కారణం తెలిసి.. వెంటనే ఆ సర్పంచ్‌ను తొలగించి, ఇన్‌చార్జి సర్పంచ్‌గా మరొకరిని నియమించారు.
లక్ష్మీ బాయి అదే గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తి నుంచి 2020లో 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. ఒకవేళ అప్పును తీర్చినట్లయితే.. పంచాయతీ పనులను తన పదవీకాలం ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకుంది. ఇందుకోసం100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం చేసుకున్నారు.
అయితే.. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో ఆమె అన్నంత పని చేసింది. ఇది చాలదన్నట్లు కుష్వాహా ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ ద్వారా కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు. ఈ విషయం గునా జిల్లా యంత్రాగం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. మే 9న సర్పంచ్ లక్ష్మీ బాయిని అధికారికంగా ఆమె పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే.. రణవీర్ సింగ్ కుష్వాహా, సర్పంచ్ కుర్చీలో కూర్చున్న మూడో వ్యక్తిపై సైతం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. 2022 పంచాయతీ ఎన్నికల సమయంలో తన ప్రచారానికి నిధులు సమకూర్చుకోవడానికి లక్ష్మీ బాయి ఈ రుణం తీసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను లక్ష్మీ బాయి భర్త శంకర్ సింగ్ ఖండించారు. తాము ఎవరి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని.. లక్ష్మీ బాయిని అన్యాయంగా పదవి నుండి తొలగించారని, ఇకనైనా తమను వదిలేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.