breaking news
panchayati office
-
ఇదెక్కడి ‘పంచాయితీ’!
ఆమె ఓ గ్రామ సర్పంచ్. లక్షల్లో అప్పులు చేసింది. అది తీర్చడం కుదరకపోయేసరికి ఏకంగా పంచాయితీనే మరొక వ్యక్తికి లీజు కింద అప్పగించింది. అయితే ఇప్పటికిప్పుడు జరిగిందేం కాదు!. చాలా కాలం కిందటే ఆమె ఇలా కాంట్రాక్ట్ కుదుర్చుకుని పంచాయితీ ఆఫీస్‌ను అతని చేతిలో పెట్టిందట!. ఇదేం పంచాయితీ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.మధ్యప్రదేశ్ గుణ జిల్లాకు కరోడ్ గ్రామ పంచాయితీలో ఆ ఊరి సర్పంచ్ లక్ష్మీ బాయి సీట్లో మరో వ్యక్తి కూర్చోవడం ఉన్నతాధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు గల కారణం తెలిసి.. వెంటనే ఆ సర్పంచ్‌ను తొలగించి, ఇన్చార్జి సర్పంచ్‌గా మరొకరిని నియమించారు.లక్ష్మీ బాయి అదే గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తి నుంచి 2020లో 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. ఒకవేళ అప్పును తీర్చినట్లయితే.. పంచాయతీ పనులను తన పదవీకాలం ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకుంది. ఇందుకోసం100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం చేసుకున్నారు.అయితే.. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో ఆమె అన్నంత పని చేసింది. ఇది చాలదన్నట్లు కుష్వాహా ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ ద్వారా కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు. ఈ విషయం గునా జిల్లా యంత్రాగం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. మే 9న సర్పంచ్ లక్ష్మీ బాయిని అధికారికంగా ఆమె పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే.. రణవీర్ సింగ్ కుష్వాహా, సర్పంచ్ కుర్చీలో కూర్చున్న మూడో వ్యక్తిపై సైతం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. 2022 పంచాయతీ ఎన్నికల సమయంలో తన ప్రచారానికి నిధులు సమకూర్చుకోవడానికి లక్ష్మీ బాయి ఈ రుణం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను లక్ష్మీ బాయి భర్త శంకర్ సింగ్ ఖండించారు. తాము ఎవరి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని.. లక్ష్మీ బాయిని అన్యాయంగా పదవి నుండి తొలగించారని, ఇకనైనా తమను వదిలేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. -
బడికి పంతులు లేడని..
ఆత్మకూరు రూరల్(కర్నూలు): పాఠశాలలో ఉపాధ్యాయులు లేక తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని స్కూలుతోపాటు పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలోని సంచారజాతుల విముక్తి పథకం కింద ప్రత్యేకంగా ఏర్పాటైన పాఠశాల ఉంది.ఇందులో 160 మంది విద్యార్థులకు గాను ఒకే టీచర్ ఉన్నారు. దీంతో తమ పిల్లల చదువులు ముందుకు సాగటం లేదని గ్రామస్తులు అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఎవరూ స్పందించక పోవడంతో ఇటీవల పాఠశాల నుంచి 50 మంది బాలలు వేరే చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన వంద మంది విద్యార్థులకు చదువు చెప్పడం అటుంచి కనీసం వారిని అదుపు చేయడానికి కూడా అక్కడున్న టీచర్‌కు వీలుకావటం లేదు. ఈ వ్యవహారంతో విసిగిన సిద్దాపురం గ్రామస్తులు శనివారం పాఠశాలలో, గ్రామ సచివాలయంలోనూ జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించారు. -
ఏడాది నుంచి జీతం ఇవ్వట్లే..
చోడవరం(విశాఖపట్టణం జిల్లా): సాధారణంగా ఒక్కనెల జీతం ఆలస్యమైతేనే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. మరి అలాంటిది ఏడాది నుంచి జీతం అందకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ సంఘటన విశాఖ జిల్లా చోడవరం మండలం కేంద్రంలో వెలుగుచూసింది. చోడవరం మండల పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఏడాదిగా జీతాలు ఇవ్వడంలేదు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు బుధవారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించాలనీ వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు సీపీఐ మద్ధతు ప్రకటించింది. -
విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర
రేగోడ్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలు అధికారులపై కన్నెర్రజేశారు. బిల్లుల వసూళ్ల కోసం వచ్చిన విద్యుత్ సిబ్బందిని రైతులు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన సంఘటన మండలంలోని కొత్వాన్‌పల్లిలో గురువారం జరిగింది. ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లులను వసూలు చేసేందుకు వచ్చిన హెల్పర్ విఠల్‌రెడ్డి, బిల్‌కలెక్టర్ పాషాలపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అరగంట సేపు నిర్బంధించారు. ఎన్నోమార్లు తాము సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో పంటలు పండని దుస్థితి నెలకొందన్నారు. వేసిన పంటలు పండకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఇళ్లకు సైతం విద్యుత్ కోతలు పెడుతున్నారన్నారు. ఉదయం వేళల్లో కరెంటులేక అవస్థలు పడుతున్నామని మహిళలు పేర్కొన్నారు. ఏడీ, ఏఈలు వచ్చే వరకు వారిని వదిలేదని కరాఖండిగా చెప్పారు. దీంతో హెల్పర్ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారిని వదిలిపెట్టారు. కొండాపూర్‌లో విద్యుత్ ఏడీఈ నిర్బంధం మిరుదొడ్డి: కరెంటు కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌లోనే విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన సంఘటన గురువారం మిరుదొడ్డి మండలం కొండాపూర్‌లో జరిగింది. వేళాపాళా లేని కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని వారు నిరసన వ్యక్తం చేస్తూ, కార్యాలయం ఏదుటే వంటావార్పు చేపట్టారు. రైతులకు నిరంతరం విద్యుత్‌ను అందిస్తామనే ప్రభుత్వ హామీలు నీటిమూటలుగానే మిగిలాయని వారు ఆరోపించారు. తుపాను, వర్షాల వల్ల ఖరీప్ సీజన్లో తీవ్రంగా నష్ట పోయామని, రబీ సీజన్లోనైనా పంటలు ఆదుకుంటాయని ఆశిస్తే విద్యుత్ కోతలతో కునుకు లేకుండా చేస్తున్నారని రైతులు మండి పడ్డారు. ఎండా కాలం రాకముందే విద్యు త్ సమస్య ఇంత లా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని మండి పడ్డారు. గంటసేపు ఏడీఈ నిర్బంధం విషయం తెలుసుకున్న ఏడీఈ పండ రి సంఘటన స్థలానికి రాగానే రైతులు కోపోద్రిక్తులయ్యారు. విద్యుత్ ఏఈ శ్రీనివాస్‌కు సమస్యను ఎన్ని సార్లు విన్నవించినా స్పందించడం లేదని ఏడీఈ పండరితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగని రైతులు ఏడీఈ ని ఈడ్చుకుంటూ వెళ్లి సబ్ స్టేషన్ కార్యాలయంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి ఎస్ఐ బొడిగం సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఏడీఈ పండరిని విడిపించారు. దీంతో రైతులకు ఎస్ఐకి వాగ్వాదం జరిగింది. ఇకకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ఏడీఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఏఈ హామీతో సిబ్బంది విడుదల సంగారెడ్డి రూరల్డ్: విద్యుత్ సమస్యపై ఆగ్రహించిన గ్రామస్తులు బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన సిబ్బందిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన సంఘటన సంగారెడ్డి మండలం కందిలో గురువారం చోటుచేసుకుంది. విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన లైన్మెన్లు నారాయణ, శ్రీరాంరెడ్డి, జూనియర్ లైన్మెన్ జైపాల్, బిల్‌కలెక్టర్ ప్రకాశ్‌ను గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా బిల్లులు వసూలు చేసేందుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. గ్రామంలో ఇళ్లపై నుంచి విద్యుత్ తీగలు వెళ్తూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం, పంట పొలాల్లో తీగలు చేతికందేలా వేలాడుతున్నాయన్నారు. విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి తీసుక వచ్చినా ఫలితం లేదన్నారు. సమస్యపై సిబ్బందికి ఫోన్‌చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అధికారులు వచ్చేవరకు సిబ్బందిని వదిలేది లేదని చెప్పడంతో రూరల్ ఏఈ రాములు రైతులతో మాట్లాడి ఇకపై ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామరైతులు, ప్రజలు శాంతించి సిబ్బందిని విడిచిపెట్టారు.