
బడికి పంతులు లేడని..
పాఠశాలలో ఉపాధ్యాయులు లేక తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని స్కూలుతోపాటు పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఆత్మకూరు రూరల్(కర్నూలు): పాఠశాలలో ఉపాధ్యాయులు లేక తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని స్కూలుతోపాటు పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలోని సంచారజాతుల విముక్తి పథకం కింద ప్రత్యేకంగా ఏర్పాటైన పాఠశాల ఉంది.ఇందులో 160 మంది విద్యార్థులకు గాను ఒకే టీచర్ ఉన్నారు.
దీంతో తమ పిల్లల చదువులు ముందుకు సాగటం లేదని గ్రామస్తులు అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఎవరూ స్పందించక పోవడంతో ఇటీవల పాఠశాల నుంచి 50 మంది బాలలు వేరే చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన వంద మంది విద్యార్థులకు చదువు చెప్పడం అటుంచి కనీసం వారిని అదుపు చేయడానికి కూడా అక్కడున్న టీచర్‌కు వీలుకావటం లేదు. ఈ వ్యవహారంతో విసిగిన సిద్దాపురం గ్రామస్తులు శనివారం పాఠశాలలో, గ్రామ సచివాలయంలోనూ జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించారు.