సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ సంస్థలతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇందులో భాగం అయ్యింది. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం (ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్) సహా పలు కీలక సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అయితే ఈ పేలుడు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడేనని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థలు భారతదేశంలోని స్థానిక ఉగ్రవాద నెట్‌వర్క్ సహాయంతో సంయుక్తంగా ఈ కుట్రను నిర్వహించాయి. జైషే మహమ్మద్ సానుభూతిపరుడు డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు కారణమైన ఐ20 కారును నడిపింది ఉమర్ అని నిర్ధారణ అయ్యింది.
ఈ కారు ముగ్గురి చేతులు మారినట్లు తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు అసలు ఓనర్ మహ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. దానిని తారిఖ్ అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికి వెళ్లింది. డాక్టర్ ఉమర్ ఆ కారును నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో డాక్టర్ ఉమర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్న సమయంలో.. ఇలా ఆత్మాహుతి జరిపి ఉంటాడని భావిస్తున్నారు. పేలుళ్లలో చనిపోయిన అతన్ని.. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలోనూ వాహనంలో పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పేల్చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఈ దాడి చేసి ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో.. దేశంలో భారీ ఉగ్రకుట్రను భద్రతాబలగాలు భగ్నం చేసి, పెద్దఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రెండు రోజుల కిందట పట్టుబడిన డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజంమిల్ అహ్మద్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల నుంచి 2,900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పట్టుబడిన నలుగురిని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు.
చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో లాల్‌ఖిలా మెట్రోస్టేషన్‌కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గిఅయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయిలో సమీక్షించారు. క్షతగాత్రులకు ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.



