ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించి చర్యలు ఫలించలేదు. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది.
అజిత్‌తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్‌లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు.
మహాయుతి దూకుడు..
మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది.


