యూపీ బడుల్లో పత్రికా పఠనం తప్పనిసరి
స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ల మధ్య నలిగిపోతున్న బాల్యాన్ని అక్షరాల వైపు మళ్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ’వార్తాపత్రిక పఠనం’ తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం చదవడమే కాదు.. విశ్లేíÙంచడం, నేర్చుకోవడం లక్ష్యంగా ఈ ’పఠన ప్రచారం’ సాగనుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో జరిగే మార్పులివే..
అసెంబ్లీలో 10 నిమిషాల పఠనం
రోజూ ఉదయపు ప్రార్థన సమయంలో కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికలు చదవాలి. జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలతో పాటు ముఖ్యమైన సంపాదకీయాలను విద్యార్థులు అందరికీ చదివి వినిపించాలి.
పద సంపద ప్రదర్శన
రోజూ దినపత్రికల్లోని ఐదు కఠిన పదాలను ఎంపిక చేసి, వాటిని నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థుల పద సంపద మెరుగుపడుతుంది. పాఠశాల గ్రంథాలయాల్లో మాతృభాష హిందీతో పాటు ఆంగ్ల దినపత్రికలను కూడా అందుబాటులో ఉంచాలి. పువ్వులు వద్దు.. పుస్తకాలే ముద్దు.. నినాదంతో పాఠశాల వేడుకల్లో ట్రోఫీలకు బదులు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్లు, సంపాదకీయ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. పాఠశాల మ్యాగజైన్లు లేదా సొంతంగా పత్రికల నిర్వహణ, సుడోకు, క్రాస్‌వర్డ్ పోటీలను ప్రోత్సహిస్తారు. చిన్న పిల్లల కోసం వార్తల కటింగ్స్‌తో స్క్రాప్ బుక్ తయారు చేయిస్తారు.
ఫోన్లకు బానిస కాకుండా..
విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పార్థసారథి సేన్ శర్మ తెలిపారు. ‘వార్తాపత్రికలు చదవడం వల్ల పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సహాయపడుతుంది. ఏది నిజమైన వార్త, ఏది నకిలీ వార్త అనే తేడాను గుర్తించే పరిణతి వారిలో వస్తుంది’.. అన్నారాయన. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి.. విద్యార్థులను అక్షరాల వైపు మళ్లించేందుకు యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్


