ఒంగోలు టౌన్: శుక్రవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో జిల్లాకు చెందిన జర్నలిస్టుల కుమార్తెలు ఇద్దరు సత్తా చాటి ఉన్నత కొలువులు సంపాదించారు. ఒంగోలులో ఒక దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాళ శ్రీనివాస్ కూతురు శృతి గ్రూప్ 1 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారిగా ఎంపికయ్యారు.
బేతాళ శృతి తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఒంగోలులోని కమ్మపాలేనికి చెందిన, ఓ పత్రికలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న పెండ్యాల రామకోటేశ్వరరావు కుమార్తె వెంకట నవీన డీఎస్పీగా ఎంపికయ్యారు. రామకోటేశ్వరరావు సతీమణి టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్ట్ కుటుంబాలకు చెందిన ఇద్దరు గ్రూపు–1 ఉద్యోగాలు సాధించడంతో పలువురు విలేకర్లు అభినందనలు తెలిపారు.


