
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.
అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.
ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.
ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండి
పాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.
‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను.
కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025