
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై పలు ప్రశ్నలు లేవనెత్తుతుండగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)దీనికి కౌంటర్ వేసింది. రాహుల్ తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత పౌరురాలు కావడానికి ముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరును ఎలా చేర్చారని ప్రశ్నించింది.
భారత ఓటర్ల జాబితా విషయంలో నాడు సోనియా గాంధీ చేసిన ప్రయత్నం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. అందుకే అనర్హులు, అక్రమ ఓటర్లను క్రమబద్ధీకరించడంపై రాహుల్‌కున్న వ్యతిరేకత ఇప్పుడు బయటపడుతోందంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సోనియా గాంధీ పేరు తొలుత 1980లో ఓటర్ల జాబితాలో కనిపించింది . ఆమె భారతీయ పౌరురాలు కావడానికి మూడేళ్ల ముందే ఇది జరిగింది. అప్పటికి ఆమె ఇటాలియన్ పౌరసత్వాన్ని కలిగివున్నారు. ఆ సమయంలో గాంధీ కుటుంబం సఫ్దర్‌జంగ్ రోడ్డులోని నాటి ప్రధాని ఇందిర అధికారిక నివాసంలో ఉండేది. ఆ చిరునామాలో నమోదు చేసుకున్న ఓటర్లుగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ,మేనకా గాంధీ పేర్లున్నాయి.
1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల జాబితాను సవరించారు. ఈ సవరణ సమయంలో, సోనియా గాంధీ పేరు పోలింగ్ స్టేషన్ 145లో సీరియల్ నంబర్ 388లో జతచేశారు. అయితే ఆమె పౌరసత్వం విషయంలో పలువురి నుంచి వ్యతిరేకత వచ్చిన దరిమిలా ఆమె పేరు జాబితా నుండి తొలగించారు. 1983లో జరిగిన ఓటర్ల జాబితాల సవరణలో, సోనియా గాంధీ పేరు పోలింగ్ స్టేషన్ 140లోని సీరియల్ నంబర్ 236లో నమోదయ్యింది. ఇది 1983 జనవరి ఒకటిన జరిగింది. ఆమెకు 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం లభించిందని మాల్వియా తెలిపారు. భారత పౌరసత్వం లేకుండానే సోనియా గాంధీ పేరు రెండుసార్లు ఓటర్ల జాబితాలోకి ప్రవేశించిందని ఆయన ఆరోపించారు.