ట్రంప్‌ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం | Rahul Gandhi Agrees Trump India Dead Economy Comments | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం

Jul 31 2025 3:56 PM | Updated on Aug 1 2025 1:16 AM

Rahul Gandhi Agrees Trump India Dead Economy Comments

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడికి నచ్చినట్లే వాణిజ్య ఒప్పందం కుదురుతుంది 

ట్రంప్‌ చెప్పిందే మోదీ చేస్తారని ఎద్దేవా

న్యూఢిల్లీ: తాము విధించిన టారిఫ్‌ల దెబ్బకు భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఖతమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆయన నిజమే చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మినహా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, మీకు తెలియదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. రాహుల్‌ గురువారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. 

ట్రంప్‌ చెప్పినట్లుగానే మన దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అదే ప్రధాని మోదీ అదే చేస్తారంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా, రక్షణపరంగా, విదేశాంగ విధానాల విషయంలోనూ దేశాన్ని నాశనం చేసి, ఒక్క అదానీకి మాత్రమే సాయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు నాశనమై పోయాయని దుయ్యబట్టారు. ‘మనది అద్భుతమైన విదేశాంగ విధానం అంటూ విదేశాంగ మంత్రి అంటున్నారు. కానీ, ఒక వైపు అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా మన వెంటబడుతోంది.
 

 మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు దౌత్య ప్రతినిధులను పంపినా ఏ ఒక్క దేశం కూడా పాక్‌ చర్యలను ఖండించలేదు. వీరికి దేశాన్ని ఎలా నడపాలో తెలియదు. అంతటా గందరగోళమే’అని రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్‌ స్పందిస్తూ, ప్రధానమంత్రి తన ప్రసంగంలో ట్రంప్‌ పేరును గానీ, చైనాను గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు.

 ‘పాకిస్తాన్‌ ఉగ్ర చర్యలను ఏ దేశమూ ఖండించలేదన్న విషయాన్ని మోదీ చెప్పలేదు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఘన విజయం సాధించామంటూ వారిద్దరూ ప్రకటించారు. ఏమిటా విజయం?’అని రాహుల్‌ ప్రశ్నించారు. ‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ తన వల్లేనంటూ ట్రంప్‌ 30 సార్లు ప్రకటించుకున్నారు. 

భారత్‌ ఐదు విమానాలు నష్టపోయిందని చెప్పిన ట్రంప్‌..భారత్‌పై ఇప్పుడు 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకని మీరు అడిగారా? ఇందుకు కారణం ఏమిటి? మోదీ ఎవరి కంట్రోల్‌లో ఉన్నారు?’అని రాహుల్‌ వాగ్బాణాలు సంధించారు. ‘భారత్‌–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో అంతా ట్రంప్‌ చెప్పినట్లుగా జరుగుతుంది’అని రాహుల్‌ పేర్కొన్నారు. 

అనంతరం రాహుల్‌ ‘ఎక్స్‌’లో..‘భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మోదీయే చంపేశారు. 1. అదానీ–మోదీ భాగస్వామ్యం. 2. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ. 3. విఫలమైన తయారీరంగం 4. నాశనమైన చిన్న పరిశ్రమలు 5. దోపీడీకి గురైన రైతులు. వీటన్నిటితోపాటు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోదీ దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు’అని రాహుల్‌ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement