
న్యూఢిల్లీ: తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పిదమేనని అన్నారాయన.
శుక్రవారం ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను... ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఓ తప్పు చేశానని అర్థమవుతోంది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ(ఓబీసీలనుద్దేశించి..) సమస్యలు లోతుగా అర్థం చేసుకోలేకపోయాను..
.. మీ చరిత్రను, మీ సమస్యలను కొంచెం అయినా ముందే తెలుసుకుని ఉండినట్లైతే, అప్పటికే కుల గణాంకాలు (Caste Census) నిర్వహించేవాడిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయాం. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ముమ్మాటికీ నా తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారాయన.
ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా?. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా?. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించేవారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అని ప్రశ్నించారాయన. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్న రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని ఉద్ఘాటించారు.
#WATCH | Delhi: At Congress' 'Bhagidari Nyay Sammelan', Lok Sabha LoP Rahul Gandhi says, "I have been in politics since 2004...When I look back, I can see that I made a mistake. I didn't protect the OBCs like I should have...It was because I could not understand your issues in… pic.twitter.com/uink9xyKFJ
— ANI (@ANI) July 25, 2025
మోదీపై రాహుల్ విసుర్లు
ఇదే వేదికగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు గుప్పించారు. ‘‘మోదీకి అంత సీన్ లేదు. ఆయనదంతా బిల్డప్పు మాత్రమే. అంత శక్తేం ఆయనకు లేదు. అవసరంగా అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీతో రెండు,మూడుసార్లు భేటీ అయ్యాక.. ఆయనేం పెద్ద సమస్య కాదని అర్ధమైందని రాహుల్ అన్నారు. దేశంలో దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు 90 శాతం ఉన్నారు. కానీ,బడ్జెట్ హల్వా తయారీలో ఈ వర్గాలకు చెందిన ఎవరికీ ప్రాధాన్యం ఉండదు. ఆ హల్వా తయారీకి ఈ వర్గాలే కారణం. కానీ, తినడానికి మాత్రం వీళ్లు అర్హులు కారా?’’ అని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు.