
బడుగు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడ్డారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి
బిహార్ మిథిలా యూనివర్సిటీలో ‘శిక్షా న్యాయ్ సంవాద్’
దర్భంగా/పట్నా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కులగణనకు మద్దతుగా ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాయని అన్నారు. గురువారం బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని మిథిలా యూనివర్సిటీ అంబేడ్కర్ హాస్టల్‌లో ‘శిక్షా న్యాయ్ సంవాద్’లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులతో సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీకి చేరుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. యూనివర్సిటీ గేటు వద్ద తన వాహనాన్ని నిలిపివేశారని, దాంతో వాహనం దిగి మరో మార్గంలో నడుచుకుంటూ వచ్చానని రాహుల్ తెలిపారు. ప్రజలు తనకు కొండంత బలం ఇచ్చారని, అందుకే బిహార్ ప్రభుత్వం తనను అడ్డుకోలేకపోయిందని అన్నారు.
ఈ ప్రజాబలం ముందు ప్రధాని మోదీ సైతం తలవంచాల్సిందేనని స్పష్టంచేశారు. భారత రాజ్యాంగాన్ని తలతో తాకాలని మోదీకి చెప్పామని, చివరకు ఆయన ఆ పని చేయక తప్పలేదని అన్నారు. దేశమంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశామని, దానికి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే మోదీ ఈ రెండింటికీ అంగీకరించారని రాహుల్ గాంధీ వెల్లడించారు.
అంబానీ, అదానీల సేవలో మోదీ సర్కారు తరిస్తోందని మండిపడ్డారు. దేశంలో కేవలం ఐదు శాతం ఉన్న ధనవంతుల బాగు కోసమే మన వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనుల, ఓబీసీలను పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, కార్పొరేట్ ప్రపంచం, మీడియాలో వారికి స్థానం దక్కడం లేదన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు
మూడు ప్రధాన డిమాండ్లపై యువత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం కోసం జాప్యం లేకుండా విడుదల చేయాలన్నారు.
ఎన్డీయే పాలనలో పెద్దగా ఆశించలేమని.. కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, మీడియాలో బీసీల ప్రాతినిధ్యం లేదని, ఈ అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని ఓ విద్యార్థి కోరారు.
‘ఫూలే’ చిత్రం తిలకించిన రాహుల్
రాహుల్ గాంధీ గురువారం బిహార్ రాజధాని పాట్నాలోని సినిమా హాల్‌లో హిందీ చిత్రం ‘ఫూలే’ను తిలకించారు. బిహార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం రాహుల్‌తో కలిసి ఈ సినిమా చూశారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం ఆధారంగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.