
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
తెలంగాణ ప్రభుత్వ కులగణనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారు
మేం కాంగ్రెస్‌లా తూతూమంత్రంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తాం
రేవంత్, రాహుల్ ద్వయం బీసీలను మభ్యపెడుతున్నారంటూ విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పనికి రానిదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో డొంకతిరుగుడు ప్రచారంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలు బీసీలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధమైనవి కాకుండా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా చేసినట్టు తాము దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణన ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి, భవిష్యత్‌లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి వారికోసమే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ హేళన చేయడాన్ని ఆక్షేపించారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
1972లో లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా అంటూ ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వేరేవారికి నీతులు చెప్పే రేవంత్‌రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని, మెట్రోకు వందశాతం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలన్న డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు.