
ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకంపై తాత్కాలికంగా స్టేవిధించింది.
గతంలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం బీఆర్‌ఎస్ నేతల పిటిషన్‌పై సుప్రీం ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. కోదండరామ్, అమీర్ అలి ఖాన్‌ల నియామకాల స్టేవిధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
తీర్పు ఇలా వస్తుందని అనుకోలేదు: ఆమీర్ అలీ ఖాన్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఆమీర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతాను. కొద్ది సేపటి క్రితమే సుప్రీం కోర్టులో జరిగిన విషయాల గురించి తెలుసుకున్నారు. నేను మొన్నటి వరకు జర్నలిస్టును. నాకు ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు.ఇదే అంశంపై న్యాయ పోరాటం చేస్తాం’ అని అన్నారు.