కృత్రిమ మేధపై ఆధారపడితే అసలుకే ముప్పు
హెచ్చరిస్తున్న అంతర్జాతీయ పరిశోధనలు
సాక్షి, స్పెషల్ డెస్క్: కృత్రిమ మేధ.. ఈ దశాబ్దపు సాంకేతిక విప్లవం. కంపెనీలు, పరిశోధన సంస్థలు, విద్యాలయాలు, వ్యక్తులు.. అందరికీ ఏఐ ఒక ఆయుధం అయ్యింది. విద్యార్థుల అభ్యాస ప్రక్రియను ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మెరుగుపరుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. జెనరేటివ్ ఏఐ సాధనాలు మెరుపు వేగంతో తరగతి గదుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవానికి ఈ ఏఐ సాధనాలు.. క్లిష్టమైన మానసిక సామర్థ్యాలను పెంచడానికి బదులుగా దెబ్బతీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
నేచర్ జర్నల్‌లో..: విద్యకు సంబంధించి ఏఐపై అనేక అధ్యయనాలు, సానుకూల నివేదికలు వెలువరించాయి. వాటిలో ఒకటి 2025 మే నెలలో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. చాట్‌బాట్‌లు అభ్యాసం, ఉన్నతస్థాయి ఆలోచనలకు సహాయ పడతాయని ఈ నివేదిక వెల్లడించింది. కానీ ఈ పరిశోధనా పత్రాలలో చాలా వాటిలో విధానపరమైన లోతుపాతులను నిపుణులు ఎత్తి చూపారు. విద్యార్థుల పనితీరు, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను ఏఐ దెబ్బతీస్తోందని ఇతర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు చాట్ జీపీటీని ఎక్కువగా ఉపయోగించిన విద్యార్థులు.. ఆ జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులో లేకపోతే.. అదే టాస్క్‌ను చేయలేక చేతులెత్తేశారని ఒక పరిశోధన పత్రం స్పష్టం చేసింది. ఆలోచన, జ్ఞాపక శక్తి, ధ్యాస, సమస్య పరిష్కారం, తార్కికత, భావనలను అర్థం చేసుకోవడం, వినడం వంటివి ముఖ్యమైన మానసిక ప్రక్రియలు.
జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది
ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల అభ్యాసం, జ్ఞాపకశక్తిపై హానికరమైన ప్రభావం ఉంటుందని బాయ్‌జీ స్టేట్ యూనివర్సిటీలో కాగ్నిటివ్ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రియాన్ డబ్లు్య స్టోన్ వెల్లడించారు. ‘ఈ సాంకేతికత సొంత అవగాహన, సామర్థ్యాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇది మెటాకాగ్నిటివ్ ఎర్రర్స్‌కు దారితీస్తుంది. ఉదాహరణకు కారులో తరచూ వెళ్లే దారిపై దృష్టి సారించకుండా పూర్తిగా జీపీఎస్‌కు అలవాటు పడితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది’అని వివరించారు. ఒక వ్యక్తి తన మానసిక సామర్థ్యాలను కచ్చితంగా పర్యవేక్షించే, మూల్యాంకనం చేసే, నియంత్రించే సామర్థ్యంలో లోపాలను మెటాకాగ్నిటివ్ ఎర్రర్స్ అంటారు.
మెదడు చేయకపోతే..
సంప్రదాయ వెబ్ శోధనకు బదులుగా చాట్ జీపీటీని ఉపయోగించి ఒక అంశంపై పరిశోధన చేసిన విద్యార్థులు సంబంధిత టాస్క్ సమయంలో తక్కువ జ్ఞాన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది. వారు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవడంతో పరిశోధించిన అంశం గురించి అధ్వానమైన తార్కికతను వెల్లడించారు. మరొక అధ్యయనంలో ఏఐ వాడనివారి కంటే.. ఏఐ ఉపయోగించి చాట్ జీపీటీ నుంచి సమాచారాన్ని కాపీ, పేస్ట్ చేయడం ద్వారా విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేశారు.
కానీ ఈ విద్యార్థులు జ్ఞాన సముపార్జనలో వెనుకబడ్డారు. ఇలా ఏఐపై ఆధారపడడం (మెటాకాగ్నిటివ్ లేజీనెస్) వల్ల స్వల్పకాలంలో పనితీరు మెరుగుదలను ప్రేరేపించవచ్చు. కానీ దీర్ఘకాలిక నైపుణ్యాల స్తబ్దతకు కూడా దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నైపుణ్య పునాది బలంగా ఉంటే ఏఐ సాధనాలు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ సమస్యను పరిష్కరించడానికి, అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రారంభ పనిని మెదడు చేయకపోతే ఆ పునాదులు ఏర్పడవని చెబుతున్నారు.
ఎల్లప్పుడూ మెదడుకు శిక్షణ
విద్యార్థులు ఏఐని వ్యక్తిగత శిక్షకుడిగా భావించడం ఉపయోగకరంగా ఉండొచ్చు. నేర్చుకునే విధానాన్ని సమీక్షించేలా, తదుపరి స్థాయికి వెళ్లేలా, మరింత కష్టపడి పనిచేయడానికి వెన్ను తట్టేలా ఏఐ సాధనాలు ఉండాలని బ్రియాన్ డబ్లు్య స్టోన్ తెలిపారు. ‘ఏఐ అనేది మరింత పదును పెట్టే లెర్నింగ్ సాధనంగా, ఎప్పుడూ అందుబాటులో ఉన్న జ్ఞాన సమాచార వ్యవస్థతో పర్సనలైజ్డ్ ట్యూటర్‌గా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఏఐ సాధానాలు కేవలం సమాధానాలు ఇవ్వడానికి బదులుగా విద్యార్థులకు ప్రశ్నలు సంధిస్తూ, సూచనలు చేసేలా ఉండాలి. కష్టపడి పనిచేయకుండా ఉండటానికి జవాబులతో సిద్ధంగా ఉన్న ఏఐని ఉపయోగించడం వల్ల బోధన, కోర్సు రూపకల్పన ప్రాథమిక, సాధారణ సమస్యగా కొనసాగుతుంది. అంతేకాదు జ్ఞాన నైపుణ్యాన్ని దెబ్బతీస్తున్న షార్ట్‌కట్ మెథడ్స్‌ను నివారించేలా విద్యార్థులను ప్రేరేపించాలన్న ప్రాథమిక భావన మరుగున పడుతుంది. అయితే ఏఐ ఉన్నా, లేకపోయినా లోతైన జ్ఞానం, నైపుణ్యంపై పట్టు సాధించడానికి ఎల్లప్పుడూ మెదడుకు శిక్షణ అవసరం’అని తెలిపారు.


