మనసు మాట వినే చక్రాల కుర్చీ!

Wheelchair that can be controlled with your MIND - Sakshi

వాషింగ్టన్‌:  దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్‌ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో∙కుర్చీని కంట్రోల్‌ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్‌ చైర్‌ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్‌ (స్కల్‌ క్యాప్‌) లాంటిది ధరించాలి.

ఇందులో 31 ఎలక్ట్రోడ్‌లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్‌ వెనుక  ల్యాప్‌ట్యాప్‌ ఫిక్స్‌ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top