సాక్షి, హైదరాబాద్: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్‌తో అదికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్‌పోర్టులను పేల్చివేస్తామంటూ ఇండిగో, ఎయిరిండియా ఎయిర్ లైన్స్ కార్యాలయాలకు మెయిల్స్ పంపించారు. దీంతో ఎయిర్ పోర్టు భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తున్నాయి.
ఢిల్లీలో పేలుడు ఘటనతో అంతటా అలర్ట్ ప్రకటించగా రెండు కేసుల్లో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, ఎన్‌ఐఏ, నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయల్దేరాయి. మంగళవారం కశ్మీర్‌లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినళ్ల వద్ద కట్టుదిట్ట భద్రత కొనసాగుతోంది.
భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ అత్యంత విస్ఫోటక స్వభావమున్న అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై పేల్చేశాడని తొలుత వార్తలొచ్చాయి.
అయితే ఆరుబయట అధిక వేడిమి, ఒత్తిడి కారణంగా అమ్మోనియం నైట్రేట్ పేలిపోయి ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐ20 కారును జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లీథ్‌పురాకు చెందిన ఉమర్ నబీ నడిపినట్లు సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్ తల్లి షమీమా బానో నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లను సేకరించారు.
ఇప్పటికే ఆమెతోపాటు ఉమర్ సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ ఇంట్లో సోదాలుచేసి కీలక డాక్యుమెంట్లు, ఎల్రక్టానిక్ పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. కారు పేలినప్పుడు అందులో ఉమర్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చెందుతున్న క్షతగాత్రులు ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో సోమవారం నాటి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 12కు పెరిగింది.


