మొయినుద్దీన్ నివాసం ఇదే
ఉత్సవాలు, ఊరేగింపుల్ని వినియోగించుకుందాం
అలా చేస్తే తక్కువ శ్రమతో భారీగా ప్రాణనష్టం
రిసిన్‌పై మొయినుద్దీన్‌కు యూపీ ద్వయం ప్రతిపాదన
అహ్మదాబాద్ ఏటీఎస్ విచారణలో వెలుగులోకి
హైదరాబాద్‌లోని మొయినుద్దీన్ ఇంట్లో ఏటీఎస్ సోదాలు
సాక్షి, హైదరాబాద్: అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, లక్ష్మీపూర్‌ఖేరీ జిల్లాకు చెందిన మహ్మద్ సుహైల్ సలీం ఖాన్‌లను వివిధ కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు.
ముఖ్యంగా ప్రమాదకరమైన విషం రిసిన్‌ను ఎలా తయారు చేశారు? దాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలని భావించారు? ఈ మాడ్యూల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు రిసిన్‌ను ప్రసాదాల్లో కలిపి పంచడం ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించే ఆలోచన కూడా చేసినట్లు తెలిసింది.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో వచ్చిన పత్రాలు
పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్న అబు ఖదీజా ఆదేశాల మేరకు పని చేసిన మొయినుద్దీన్‌కు అవసరమైన సమాచారం కూడా అతడి నుంచే అందింది. ఎంపిక చేసుకున్న వ్యక్తుల్ని మట్టుపెట్టే టార్గెట్ కిల్లింగ్‌కు బదులు ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం కలిగించేలా మాస్ కిల్లింగ్ చేయాలని ఖదీజా ఆదేశించాడు. దీనికోసం బాంబులు, తుపాకులు కాకుండా విషం ప్రయోగించాలని సలహా ఇచ్చాడు. ఈ మేరకు ప్రాణాంతక రిసిన్ తయారీ విధానాన్ని వివరించే పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో టెలిగ్రాం ద్వారా షేర్ చేశాడు. దీని ఆధారంగా ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసిన మొయినుద్దీన్ దాని తయారీపై కొంత పరిజ్ఞానం సంపాదించాడు.
పల్ప్ ఎక్స్‌ట్రాక్టర్ మిషన్ సహాయంతో..
ఎలాంటి రుచి లేని ఈ విషపదార్థం సైనైడ్ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆముదం గింజలపైన ఉండే తెల్లటి బుడిపె నుంచి మాత్రమే దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. దీని తయారీ కోసం మొయినుద్దీన్ స్థానిక మార్కెట్ నుంచి చిన్న సైజు పల్ప్ ఎక్స్‌ట్రాక్టర్ మిషన్ ఖరీదు చేశాడు. షావర్మా సెంటర్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మిషన్ తన వద్ద ఉన్నట్లు తెలిసినా ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల మొయినుద్దీన్ ఇల్లు, షావర్మా సెంటర్ నుంచి ఏటీఎస్ అధికారులు స్వా«దీనం చేసుకున్న వాటిలో అబు ఖదీజా పంపిన పీడీఎఫ్ ఫార్మాట్ పత్రాల ప్రింట్ అవుట్‌తోపాటు పల్ప్ ఎక్స్‌ట్రాక్టర్ మిషన్ కూడా ఉంది.
భారీ కుట్ర చేసిన యూపీ ద్వయం
తన ఇంటితోపాటు షావర్మా సెంటర్‌లో రిసిన్ తయారు చేస్తున్న మొయినుద్దీన్ దీని వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఖదీజా నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే కుట్ర అమలు చేయాలని వేచి ఉన్నాడు. సులేమాన్, సలీం ఖాన్ మాత్రం భారీ కుట్ర చేశారు. రిసిన్‌ను కలిపిన ప్రసాదాలు తయారు చేద్దామని, వాటిని పండుగలకు, ఆధ్యాత్మిక ఊరేగింపుల సమయంలో పంచి పెడదామని మొయినుద్దీన్‌కు చెప్పారు. దీనివల్ల ఒకేచోట భారీ స్థాయిలో ప్రాణనష్టం కల్పించవచ్చంటూ ప్రేరేపించారు. అయితే అబూ ఖదీజా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని మొయినుద్దీన్ వారించాడు.
అనేకమార్లు అహ్మదాబాద్‌కు మొయినుద్దీన్
గడిచిన రెండేళ్ల కాలంలో మొయినుద్దీన్ అనేకసార్లు అహ్మదాబాద్ వెళ్లివచ్చినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది సెపె్టంబర్‌లో వెళ్లిన అతను ఓ హోటల్‌లో బస చేశాడు. ఆపై గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొంత నగదు అందుకొని మరుసటి రోజు తిరిగి వచ్చాడు. ఈ విషయం ఏటీఎస్ విచారణలో అంగీకరించిన మొయినుద్దీన్ కేవలం ఖదీజా ఆదేశాల మేరకు రాకపోకలు సాగించానని, నగదు అందించిన వ్యక్తి ఎవరన్నది అతడికే తెలుస్తుందని వెల్లడించాడు. దీంతో ఈ మాడ్యూల్‌లో మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు.
పదో తరగతి వరకు ఖమ్మంలోనే..
ఖమ్మం క్రైం: మెయినుద్దీన్ సయ్యద్ ఖమ్మంవాసి కావడంతో ఆయనతో ఇక్కడ ఎవరికైనా సంబంధం ఉందా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఖమ్మం వన్‌టౌన్ ప్రాంతంలో నివాసమున్న సయ్యద్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు మకాం మార్చింది. అయితే వారి సన్నిహితులు, బంధువుల్లో కొందరు ఖమ్మంలోనే ఉండటంతో వారితో సయ్యద్ సంబంధాలు కలిగి ఉన్నాడా అనే కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది.
ఖమ్మంలోని తాత ఇంటి వద్ద పదో తరగతి వరకు చదువుకున్న మొయినుద్దీన్.. చైనాలో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన సమయంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. కాగా, గురువారం గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలోని మొయినుద్దీన్ నివాసంలో విస్తృత్త సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే వచ్చిన సిబ్బంది.. మొయినుద్దీన్ గదిలోని డైరీతోపాటు ఇతర పుస్తకాలు, కొన్ని ముడిపదార్థాలను సీజ్ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం.


