
సుధాకర్ (ఫైల్)
ముగ్గురు మావోయిస్టులు మృతి
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, వరంగల్/ చర్ల: మావోయిస్టు కీలక నేతలే టార్గెట్‌గా సాయుధ పోలీసు బలగాలు తమ వేట ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టు సాధిస్తూ మావోయిస్టుల కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్న బలగాలు నక్సల్స్ ఏరివేతను కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం దంతెవాడ–బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాలలో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందడంతో దంతెవాడ డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్ బృందం గాలింపు జరపగా చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇందులో డీకేఎస్‌జెడ్‌సీ (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడిగా పనిచేస్తున్న హనుమకొండ జిల్లా మడికొండ పీఎస్ పరి«ధిలోని తరాలపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుదీర్ అలియాస్ మురళి మృతిచెందినట్టు దంతెవాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ అధికారికంగా వెల్లడించారు. 1991లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం జనధనసర్కార్ స్కూల్స్ ఇంచార్జిగా కొనసాగుతున్నాడు. తొలుత నర్సంపేట డివిజన్ ఇంచార్జి, తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలో కొంతకాలం... తర్వాత బస్తర్‌కు సుధాకర్ వెళ్లినట్టు సమాచారం.
డీకేఎస్‌జెడ్‌సీలో కీలకంగా ఉన్న సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు చేసిన పలు కీలక ఆపరేషన్లలోనూ సుధాకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సారయ్య అంగరక్షకులు బీజాపూర్ జిల్లా బైరాంగర్‌కు చెందిన పండరు అటరా, మన్ను బర్సాలు కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. వీరిపై రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఘటనాస్థలి నుంచి ఇన్సాస్ రైఫిల్, పాయింట్ 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, నిత్యావసరాల వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్ మృతులతో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు.
100 మందికిపైగా కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు
2025 సంవత్సరంలో ఇప్పటివరకు, బస్తర్ రేంజ్‌లో వివిధ ఎన్‌కౌంటర్‌లలో 100 మంది నక్సలైట్లు మృతిచెందారు. డిసెంబర్ 2, 2024లో ములుగు జిల్లా పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు, 2024 సెపె్టంబర్ మొదటివారంలో కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, ఆయన భార్య తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
2024 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ మృతి చెందారు. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతల ఏరివేతలోనూ భద్రత బలగాలు రోజురోజుకూ పట్టు సాధిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్)కు సరిహద్దున తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ బలగాల దాడులు ముమ్మరం కావడంతో మావోయిస్టులు ఆత్మరక్షణకే పరిమితం అవుతున్నారు.