ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్‌ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా జైషే-మహమ్మద్ చీఫ్ మసూద్ చెల్లెలితోనూ తను సంప్రదింపులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుల్వామా అటాక్ ఈపదం వింటే చాలు భారతావని గుండె బరువెక్కుతోంది. 2019లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై జైషే-మహమ్మద్ అనే ఉగ్రసంస్థ జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడుల వ్యూహకర్తగా ఉమర్ ఫారుక్ భావిస్తారు. తాజాగా ఫరీదాబాద్‌లో అరెస్టయిన డా.షహీన్ సయీద్‌కి ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తుంది.
ఇటీవలే ఏర్పాటైన జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్-ఉల్-మెమినాత్ లో అపీరా బీబీది ప్రధానపాత్రని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. డా. షహీన్ కేవలం అపీరాతోనే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెలితోనూ సంప్రదింపులు జరిపినట్లు ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది.
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో డాక్టర్ షహీన్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. విచారణలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఎన్‌ఐఏ మరింత లోతుగా విచారణ జరుపుతుంది.


