
ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందుకు..
సీబీఐ వలలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి, మాజీ ఎమ్మెల్యే కుమారుడు జీవన్‌లాల్ సహా ఐదుగురి అరెస్టు
18 చోట్ల సోదాలు జరిపిన సీబీఐ అధికారులు
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్‌లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు.
మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది.
దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్‌లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్‌లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు.