దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఇది ఉగ్రదాడి అని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ పేలుడు నేపథ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు కేంద్రం ఆపరేషన్ సిందూర్ 2.0 చేపట్టబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మేజర్ శ్రీనివాస్‌తో సాక్షి ఫ్యామిలీ ప్రత్యేకంగా మాట్లాడింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రజల కోరిక మేరకు జరిగిందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించిందనీ, దాని నేపథ్యంలోనే ప్రధాని ఆపరేషన్ సిందూర్ చేపట్టారని వెల్లడించారు. మళ్లీ ఇలాంటి దాడి జరగడం మన దేశానికి పాకిస్తాన్ బహిరంగ సవాల్ విసిరినట్టే భావించాలని శ్రీనివాస్ అన్నారు. తాజా ఢిల్లీ ఎటాక్ నేపథ్యంలో ప్రజలు కోరుకుంటే ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యమన్నారు.
అయితే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు క్యాబినెట్ నిర్ణయం అనేది చాలా కీలకం. ఉగ్రమూకల దాడులను తిప్పికొట్టకపోతే, వాళ్లు మరింత పేట్రేగి పోయే అవకాశం ఉంది. అందుకే దీన్ని అడ్డుకోవాల్సిందే అన్నారాయన. ఉగ్రదాడి అని తేలితే కచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే ఇది ప్రెషిషన్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ 2.0నా, లేదా నేరస్థులను మట్టు బెట్టడమా అనేది అత్యధిక సెక్యూరిటీ సంస్థ నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాస్ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ ఆగిందా? కొనసాగుతుందా అనే దానికి సమాధానం ఇస్తూ శ్రీనివాస్ ఏమన్నారంటే... పేరు ఏదైనా గానీ, ఉగ్రవాదుల చర్యల్ని నిరోధించే చర్యగా ఉండాలన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే, ప్రతిఘటన తప్పదు అనే భయం ఉగ్రవాదుల్లో పుట్టాలని, అలా మన దేశ ఆపరేషన్స్ ఉండాలని, ఉంటాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాల్లో సహనానికి మారు పేరైన భారత ధోరణి, దేశ సెక్యూరిటీ స్టేటస్ ఇపుడు మారింది. భారత్‌ను దెబ్బతీయాలని చూసే ఎవరికైనా దెబ్బకు దెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు. దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయాలి, ఉగ్రవాద చర్య చేయాలి, భారత్‌ను దెబ్బతీయాలనే ఆలోచన చేసే ఉగ్రమూకల గుండెల్లో ఫిరంగులు మెగేలా ప్రస్తుత రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఆలోచిస్తోందన్నారు. మన మిలిటరీ పరంగా ఆయుధ సంపత్తి, ఆపరేషన్స్‌లో మన శక్తి సామర్థ్యాలపై ఆయన అభిప్రాయాలు, తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.


