ఎలన్‌ మస్క్‌.. గురివింద గింజ నీతి.. నీతులు చెప్తాడే తప్ప పాటించడా?

Elon Musk Neuralink Ex Employees Alleges Toxic Work Culture - Sakshi

వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఒకరు, మనిషి మెదడునే నియంత్రించేందుకు మరొకరు.. ప్రపంచంలోనే అపర కుబేరులుగా ఉన్న ఇద్దరి తాపత్రయం అంతిమంగా ఇవే. పోటాపోటీగా బెఫ్‌ బెజోస్‌, ఎలన్‌ మస్క్‌ చేయిస్తున్న ప్రయోగాలు మామూలు జనాలకు వినోదాన్ని పంచుతూ ఆసక్తికరంగా అనిపించినా.. మేధావి వర్గం మాత్రం తీవ్రంగా విబేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలన్‌ మస్క్‌కి ఊహించని పరిణామం ఎదురైంది. 

మస్క్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ స్టార్టప్‌ ‘న్యూరాలింక్‌’.. ఈ ఏడాది దాదాపు మనుషుల మీద ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు కోసం పని చేసిన మాజీ ఉద్యోగులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పనికిమాలిన ప్రయోగమని, విఫలమై తీరుతుందని అంటున్నారు. అంతేకాదు న్యూరాలింక్‌లోనూ ఉద్యోగులపై వేధింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.

న్యూరాలింక్‌లో పని చేసిన ఆరుగురు మాజీ ఉద్యోగులు.. తాజాగా ఫార్చూన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు ఈ ప్రయత్నాలపై ఎలన్‌ ఏమాత్రం సంతృప్తికరంగా లేడంటూ వాళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. న్యూరాలింక్‌ కోతులపై చూపించిన ప్రభావానికి.. మనుషులపై చూపించేదానికి బోలెడంత తేడా ఉంటుంది. ఆ విషయం ఆయనకు(మస్క్‌కు) తెలుసు. అసలు ఈ ఏడాది హ్యూమన్‌ ట్రయల్స్‌ ఉంటాయన్నది కూడా దాదాపు అనుమానమే అంటూ వ్యాఖ్యానించారు వాళ్లు.

వర్కింగ్‌ కల్చర్‌ బాగోలేదు|
ఎలన్‌ మస్క్‌ బాస్‌గా ఉన్నచోట వర్క్‌కల్చర్‌ బాగోదని గతంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోనూ ఆరోపణలు రావడం.. కోర్టు కేసులతో నష్టపరిహారం చెల్లించిన సందర్భాలను చూశాం. మేధో సంపత్తిని దోచేస్తున్నారంటూ టెక్‌ దిగ్గజ కంపెనీలపై విరుచుకుపడే ఎలన్‌ మస్క్‌.. ‘గురివింద గింజ’ తరహాలో  ఆవిష్కరణల పేరుతో సొంత ఎంప్లాయిస్‌నే ఇబ్బంది పెడుతున్నాడనే దానిపై రియలైజ్‌ కాకపోవడం విడ్డూరం!.  

ఇప్పుడు సొంత కంపెనీ న్యూరాలింక్‌లోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ పని చేసేవాళ్లంతా భయంతో మాత్రమే పని చేస్తున్నారు తప్ప.. ఇ‍ష్టంతో కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీలు. పని గంటలు, విరామం లేకుండా వర్కింగ్‌ డేస్‌, వేతనం తక్కువ, కొన్ని విభాగాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వినవస్తున్నాయి. అంతెందుకు 2021 మే నెలలో.. న్యూరాలింక్‌ సహ వ్యవస్థాపకులు మ్యాక్స్‌ హోడాక్‌ హఠాత్తుగా కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. కానీ, అందుకు గల కారణాల్ని వెల్లడించ లేదు. కానీ, మస్క్‌తో విభేధాలే అనే విషయం మొత్తం అమెరికా మీడియా కోడై కూస్తోంది.

సంబంధిత వార్త: టెస్లాలో కామాంధులు? మస్క్‌ చేష్టల వల్లే రెచ్చిపోతూ.. నిత్యం నరకమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top